చెన్నైకి బయలుదేరనున్న రజినీకాంత్, ఈ నెల 31న కొత్త పార్టీ ప్రకటన
అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని (Rajinikanth Health Bulletin) అపోలో వైద్యులు వెల్లడించారు. నేడు ఆయనను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈమేరకు శనివారం సాయంత్రం రజనీకాంత్ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి (Apollo Hospitals) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. అధిక రక్తపోటుతో బాధపడుతున్న రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి బాగుందని అపోలో వైద్య బృందం తెలిపింది. ఆయనకు కొన్ని పరీక్షలు చేశామని, వాటి రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొంది. ఈ రోజు రాత్రి ఆయనను బీపీకి సంబంధించిన వైద్యులు పర్యవేక్షణలో ఉంచుతామని చెప్పింది.
కాగా 'అన్నాత్తే' సినిమా చిత్రీకరణలో భాగంగా రజనీకాంత్ ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 22న మొత్తం చిత్ర బృందానికి నిర్వహించిన కరోనా టెస్టుల్లో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రజనీ సహా ముఖ్య నటీనటులెవరికీ కరోనా సోకనప్పటికీ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం రజనీకాంత్‌కు రక్తపోటు అధికం కావడంతో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో భయాందోళనకు గురైన ఆయన అభిమానులు రజనీ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేపట్టారు. మొత్తానికి వారి ప్రార్థనలు ఫలించి ఆయన ఆరోగ్యవంతుడై ఆదివారం డిశ్చార్జ్ అవనున్నట్లు కనిపిస్తోంది
ఇదిలా ఉంటే రజనీకాంత్ ఈ రోజు సాయంత్రం చెన్నైకి వెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కోసం బేగంపేట విమానాశ్రయంలో చార్టెడ్ ఫ్లైట్ రెడీగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రజనీకాంత్ చెన్నై వెళ్తారని సమాచారం.
ఇటీవలే ఆర్‌ఎంఎం (రజనీ మక్కల్ మండ్రం) సభ్యులతో చర్చించిన రజనీకాంత్ కొత్త పార్టీ పెడతానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 31న ఆయన పార్టీ పేరును ప్రకటించనున్నారు.