తానే దగ్గరుండి అంతా ప్లాన్ ప్రకారం చేసింది: డైరక్టర్ క్రిష్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఓ ప్లాన్ ప్రకారం అంతా చేశారని, ఇలాంటి రోజు తనకి వస్తుందని ఆమె ముందే ఊహించారని దర్శకుడు క్రిష్ అన్నారు. ‘మణికర్ణిక’ మూవీ డైరెక్షన్ క్రెడిట్ కంగన తీసుకోవడంపై ఇటీవల డైరెక్టర్ క్రిష్ ఓ ఇంటర్వ్యూలో అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి మనకి తెలిసిందే. కంగనా స్క్రిప్టులో మార్పులు చేయాలని ఒత్తిడి చేశారని ఆయన పేర్కొన్నారు. నటుడు సోనూసూద్ వివాదం విషయంలోనూ కంగన అబద్ధాలు చెప్పారని, మూర్ఖంగా, తప్పుగా ప్రవర్తించారని డైరెక్టర్ క్రిష్ చెప్పారు. ఆమె పాత్రలా మిగిలిన పాత్రలు కూడా బలంగా ఉండటం ఇష్టంలేక వాటిని సినిమా నుంచి కట్ చేయించారని కూడా తెలిపారు. తను బంగారం లాంటి సినిమా తీస్తే.. ప్రేక్షకులకు వెండి చూపించారని క్రిష్ ఆవేదన చెందారు.
దీంతో ఈ వివాదం కాస్త ముదిరింది. కంగన సోదరి రంగోలి.. డైరెక్టర్ క్రిష్‌పై మండిపడ్డారు. ‘మణికర్ణిక’ విజయాన్ని ఆస్వాదించే అవకాశం కంగనకు ఇవ్వమని ట్వీట్ చేశారు. అంతేకాదు తాజాగా ఆమె మరో ట్వీట్ చేశారు. ‘‘యన్.టి.ఆర్’ షూటింగ్లో ఉన్నప్పుడు ‘మణికర్ణిక’కు సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని నువ్వు అన్నావ్ క్రిష్.. మరి దీన్ని ఏం అంటారు?’ అంటూ కంగన ఆయనకు చేసిన వాట్సాప్ సందేశాల స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు. దీన్ని చూసిన క్రిష్ ట్విటర్లో స్పందించారు.
‘మరొక వ్యక్తిపై అబద్ధాలు చెప్పి, తప్పుడు ఆరోపణలు చేసి నా ఫిల్మ్ మేకింగ్ నైపుణ్యం ఏంటో నిరూపించుకోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. రంగోలీ.. సినిమా క్రెడిట్ తీసుకోవడం, సినిమాకు చేసిన నష్టం గురించి నేను మీ సోదరిని (కంగన) ప్రశ్నించినప్పుడు ఆమె నాకు చేసిన సందేశాలు ఇవి’ అని క్రిష్ ట్వీట్ చేశారు.