తొందర పడ్డారు ముఖ్యమంత్రి గారు..!

Friday, January 31, 2020 12:04 PM Politics
తొందర పడ్డారు ముఖ్యమంత్రి గారు..!

ఒకపక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రేషన్ కార్డుల సర్వే చేయించి మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంలో నిలబెట్టిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు. సర్వేలో ప్రభుత్వంలో ఉన్న లోపాలను, మారుతున్న కాలాన్ని పరిగణనలోకి తీసుకోకుండా జరిపిన ఈసర్వే ఎంతోమందిని నిరుత్సాహానికి గురిచేసింది అన్నమాట వాస్తవం. అధికారంతోనే కాకుండా మనసుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకున్న ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది అని ఈ సందర్భంగా చెప్పక తప్పడం లేదు. ఇన్ని రేషన్ కార్డులు వైయస్సార్ హయాంలోనే పుట్టుకు వచ్చాయి. ఆయనకు తెలీదా?వాటిని ఎవరు ఉపయోగిస్తున్నారో? సర్వే చేయించడానికి ఆ ప్రభుత్వంలో అధికారులు లేరా? కానీ ఎందుకు వదిలేశారో ఇంత పరిజ్ఞానం, విజ్ఞత ఉన్న నేటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు ఆలోచించక పోవడం దురదృష్టకరం.

అమ్మఒడి,వైయస్సార్ వసతి,ఫీజు రియంబర్స్ మెంట్,వృద్దాప్య పింఛన్ ఇలాంటి ఎన్నో ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డుతో ముడి వేసుకొని ఉన్నాయి. టెక్నాలజీ అభివృద్ధి చెంది పూరి గుడిసెలో కూడా స్మార్ట్ టీవీ, పేదవాడి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ లు వాడే రోజుల్లో ఉంటే ఒక మధ్యతరగతి కుటుంబం లోపల ఎన్నో ఇబ్బందులు పడుతూ పిల్లలకి ఏలోటు లేకుండా చూసుకోవాలి అనే ఉద్దేశ్యంతో కూలర్ క్రింద పడుకో బెట్టడం,ఐరన్ డ్రెస్ వేయడం కూడా వారి బ్రతుకులకు శాపంగా మారిన పరిస్థితులు నేటి ప్రభుత్వంలో కనిపిస్తున్నాయి. చంద్రబాబు లాంటి రాజకీయ చాణుక్యుడు కూడా కొత్తవి ఇవ్వకపోయినా ఉన్న రేషన్ కార్డులు,పింఛన్లు టచ్ చేయలేక పోయాడు అంటే కారణం ఎంత బలమైనదో ఇంత మేధాశక్తి కలిగిన జగన్ మోహన్ రెడ్డిగారు ఒక్కసారి ఆలోచించాలి.

ఆస్తులను కాకుండా వాడే విద్యుత్తు చార్జీలను పరిగణనలోకి తీసుకొని ధనవంతులుగా ముద్ర వేయడం ఎంతవరకు కరెక్టో ముఖ్యమంత్రి గారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రజలు బలంగా కోరుకొంటున్నారు.
జగన్ మోహన్ రెడ్డిగారు. ప్రస్తుత జీవన విధానాన్ని కొంత పరిగణనలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది అనిపిస్తుంది. ఈ విషయంలో కొన్ని సడలింపులు చేస్తే బాగుంటుంది. లేదంటే సామాన్యుడు తీవ్ర అసంతృప్తికి లోను అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఆలోచించండి సర్.

శ్రీదేవి రెడ్డి.

For All Tech Queries Please Click Here..!
Topics: