జులై 17వతేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించిన యుకె

Friday, March 19, 2021 12:00 PM News
జులై 17వతేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించిన యుకె

London, Jan 24: యుకెలో పుట్టిన కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ ఆ దేశాన్ని వణికిస్తోంది. అక్కడి నుంచి ప్రంపంచ దేశాలకు కూడా మెల్లిగా విస్తరించింది. కరోనావైరస్ ఛాయలు కనుమరుగవుతున్న నేపథ్యంలో ఈ కొత్త స్ట్రెయిన్ అన్ని దేశాలను వణికించేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఆంక్షలు కఠినంగా విధించాలని కొన్ని దేశాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా కరోనా కొత్త స్ట్రెయిన్ వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలో బ్రిటీష్ ప్రభుత్వం జులై 17వతేదీ వరకు లాక్‌డౌన్ (UK Extends Covid Lockdown) ఆంక్షల చట్టాలను అమలు చేయాలని తాజాగా నిర్ణయించింది. 

పబ్‌లు, రెస్టారెంట్లు, షాపులను జులై 17వతేదీ వరకు మూసివేసే అధికారాన్ని కౌన్సిల్‌లకు ఇస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ నియంత్రణ చర్యలపై సమీక్షలో భాగంగా బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాన్కాక్ ఈ నివేదిక సమర్పించారు. కరోనా ఇన్ఫెక్షన్ ను లాక్ డౌన్ ఆంక్షల అమలుతో నియంత్రించాలని నిర్ణయించినట్లు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ (Prime Minister Boris Johnson) చెప్పారు. 

బ్రిటన్ దేశంలో ప్రబలిన కరోనా స్ట్రెయిన్ వైరస్ (UK Covid Strain) పాత కరోనా జాతి కంటే ఎక్కువ ప్రాణాంతకమని బ్రిటీష్ ప్రభుత్వ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్యాట్రిక్ వాలెన్సు హెచ్చరించారు. పాత కరోనా వైరస్ వల్ల వెయ్యిమందిలో 10 మంది మరణిస్తున్నారు. కొత్త కరోనా వేరియెంట్ వల్ల 1000మంది లో 14 దాకా మరణిస్తున్నారని తేలింది. 

గత 24 గంటల్లో 4,600 మంది కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ తో ఆసుపత్రుల్లో చేరారు. బ్రిటన్ దేశంలో కరోనా మరణాల సంఖ్య ఒక్కరోజులో 1401 గా నమోదైంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య  35,83,907 కాగా మరణాల సంఖ్య 95,981కి పెరిగింది. బ్రిటన్ దేశానికి వచ్చే సందర్శకులు 10 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

బ్రిటన్ యొక్క COVID-19 టీకాను (COVID-19 vaccination) అక్కడ వేగవంతం చేశారు. 5.9 మిలియన్ల మందికి ఇప్పుడు మొదటి డోసు ఇచ్చారు. కాగా కొత్త స్ట్రెయిన్ తో మరణాలు అధికంగా ఉండే అవకాశం ఉందని ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. కఠినంగా ఆంక్షలు అమలు చేయాలని అధికారులను హెచ్చరించారు.  
 
 
 
 

For All Tech Queries Please Click Here..!