ఏపీలో గత 24 గంటల్లో భారీగా పాజిటివ్ కేసులు, రికార్డు స్థాయి మరణాలు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గత 24 గంటల్లో 22 వేల పైచిలుకు శాంపిల్స్ సేకరించారు. అయితే 2 వేల 432 పాజిటివ కేసులు వచ్చాయి. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 2412 మంది కాగా మిగతా 20 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు. దీంతో వైరస్ సోకిన మొత్తం సంఖ్య 35 వేల 451గా ఉంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల పైచిలుకు మందికి పరీక్షలు చేశారు. ఒక రోజులో 44 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 452కి చేరింది.
అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది చొప్పున చనిపోయారు. కర్నూలులో 5, చిత్తూరు, తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాలో నలుగురు, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చనిపోయారు. నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు మరణించారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 468 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వచ్చాయి. కర్నూలులో 403 రాగా చిత్తూరులో 257, తూర్పుగోదావరి జిల్లాలో 247 కేసులు వచ్చినట్టు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.