VJ Chitra Death: తమిళ బుల్లి తెర నటి వీజే చిత్ర ఆత్మహత్య.
తమిళ బుల్లితెరపై విషాదం చోటుచేసుకుంది. ‘పాండియన్ స్టోర్’లో (Pandian Stores) ముల్లై పాత్రతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నప్రముఖ తమిళనటి వి.జె.చిత్ర(28) ఆత్మహత్య (VJ Chitra Death) చేసుకున్నారు. చెన్నైలోని నజరేత్‌పేట్‌లో గల ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేసిన చిత్ర సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి (VJ Chithra has died by suicide) పాల్పడ్డారు. కొద్ది నెలల క్రితమే ఆమెకు వ్యాపారవేత్త హేమంత్‌తో నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం కాబోయే భర్తతో కలిసి హోటల్ గదిలో ఉన్న సమయంలోనే చిత్ర ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
బుధవారం ఉదయం స్నానం చేసి వస్తానని వెళ్లిన చిత్ర.. ఎంతకీ తలుపు తీయకపోవడంతో హేమంత్ హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో హోటల్ సిబ్బంది డూప్లికేట్ కీతో గది తలుపులు తెరిచారు. గదిలో చిత్ర చీరతో ఉరి వేసుకుని కన్పించింది. 28 సంవత్సరాల వయస్సున్న చిత్ర ఆత్మహత్య చేసుకోవడంపై తమిళ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది.
పాపులర్ టీవీ షో 'పాండ్యన్ స్టోర్స్'తో ఆమె మంచి నటిగా (Tamil TV Actress VJ Chitra) గర్తింపు తెచ్చుకున్నారు. వీజే చిత్ర మృతి కారణాలు వెంటనే వెల్లడి కాలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చిత్ర మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై చిత్ర కుటుంబసభ్యులు ఇంకా స్పందించలేదు.
బుల్లితెరపై విశేషంగా రాణిస్తూ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న చిత్ర ఆత్మహత్య చేసుకుందని తెలిసి ఆమె స్నేహితులు, సహనటులు షాకవుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.