మజిలీ ట్రైలర్: వెదవలకు ఎప్పుడూ మంచి పెళ్లాలే దొరుకుతారు
అప్పుడప్పుడే సినీ కెరీర్ ప్రారంభించిన నాగ చైతన్య, సమంత జంటగా ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. అప్పటికే మొదలైన వారి స్నేహం ఆటో నగర్ సూర్య మరియు మనం చిత్రాల తర్వాత ప్రేమకు దారితీసింది. పెద్దల సమ్మతితో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు కూడా. వీరిద్దరి పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న మొదటి చిత్రం "మజిలీ".
నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు చిత్రనిర్మాతలు తెలిపారు. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
రియల్ లైఫ్ తరహాలో రీల్ లైఫ్లో కూడా భార్యాభర్తలుగా చైశ్యామ్ల జంట ప్రేక్షకులను అలరించేందుకు మజిలీతో ముందుకొచ్చారు. తాజాగా ఈ చిత్ర బృందం "మజిలీ" ట్రైలర్ను లాంచ్ చేసింది. నాగ చైతన్య కెరీర్ను మలుచుకునే దశలో మొదలై... ఇష్టం లేని పెళ్లి చేసుకొని గత ప్రేమ స్మృతులతో సతమతమవుతున్న తీరుతో ట్రైలర్ ముగుస్తుంది. ప్రారంభంలో ‘నీకో సంవత్సరం టైం ఇస్తున్నాను. ఈలోపు నువ్వు సచినే అవుతావో సోంబేరే అవుతావో నీ ఇష్టం’ అంటూ రావు రమేశ్ చెప్పే డైలాగ్, చివర్లో "వెధవలకెప్పుడూ మంచి పెళ్లాలే దొరుకుతారు" అని చెప్పే పోసాని డైలాగ్, చైతన్య పట్ల సమంత చూపించే ప్రేమ, ఇష్టం లేని పెళ్లి చేసుకున్న చైతన్య పడే ఇబ్బందులు ట్రైలర్లో హైలెట్గా నిలిచాయి. ఆలస్యం ఎందుకు మీరు కూడా ట్రైలర్ చూసి ఏంజాయ్ చేయండి!