బీడ్ సర్పంచ్ హత్య కేసు, మంత్రి పదవికి ధనంజయ్ ముండే రాజీనామా
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసు వ్యవహారం రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. తాజాగా ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే (Dhananjay Munde) తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సర్పంచ్ హత్య కేసులో ఆయనపై ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని ధనంజయ్ ముండేను సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆయన తన రాజీనామాను సమర్పించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై ఫడణవీస్ మాట్లాడుతూ ముండే రాజీనామాను తాను ఆమోదించి.. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు పంపానని మీడియాకు తెలిపారు.
ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలో కీలకనేత అయిన ధనంజయ్ ముండే సొంత జిల్లా బీడ్‌లో మసాజోగ్ గ్రామ సర్పంచి సంతోష్ దేశ్‌ముఖ్‌ను కిడ్నాప్ చేసి ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేసి చంపారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ హత్యోదంతానికి సంబంధించిన కేసులో మంత్రి సన్నిహితుడు వాల్మిక్ కరాడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
