అధికారం ఉన్నపుడు అనుభవించి.. కష్టాల్లో ఉన్నపుడు వెళ్లిపోవడం ధర్మమేనా..?

Saturday, January 25, 2025 01:30 PM Politics
అధికారం ఉన్నపుడు అనుభవించి.. కష్టాల్లో ఉన్నపుడు వెళ్లిపోవడం ధర్మమేనా..?

 వైసీపీ సీనియర్‌ నాయకుడు విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు చేసిన ప్రకటనపై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ స్పందించారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం, వదిలి వెళ్లిపోవడం ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులకు ఫ్యాషన్‌ అయిపోయిందని విమర్శించారు. ఇది ధర్మమేనా అని ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి ప్రకటనపై బండ్ల గణేశ్‌ మాత్రమే కాదు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు కూడా షాక్‌కు గురయ్యారు. జగన్‌ కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్లిపోవడం సరైన నిర్ణయమేనా అని సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

విజయసాయి రెడ్డితో బండ్ల గణేశ్‌కు చాలాకాలం నుంచే విబేధాలు ఉన్నాయి. పలు సందర్భాల్లో విజయసాయి రెడ్డిపై బండ్ల గణేష్ విమర్శలు గుప్పించారు. మార్గదర్శిలో సోదాల సమయంలోనూ ఇలాగే స్పందించారు.

రాజకీయాల శాశ్వతంగా తప్పుకుంటున్నట్లుగా ట్విట్టర్‌ (ఎక్స్‌) ద్వారా విజయసాయి రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేస్తానని తెలిపారు. ఇది ఏ పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు. వేరే పదవులు, ప్రయోజనాలు, డబ్బు ఆశించి రాజీనామా చేయడం లేదని తెలిపారు.

రాజకీయాలకు గుడ్‌బై చెప్పే నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని విజయసాయి రెడ్డి తెలిపారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని.. తనను ఎవరూ ప్రభావితం చేయలేదని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్‌ కుటుంబానికి రుణపడి ఉంటానని అన్నారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్‌కు, తనను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకు సదా కృతజ్ఞుడిని అని తెలిపారు. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా అని ఆకాంక్షించారు.

పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్‌గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశానని విజయసాయి రెడ్డి తెలిపారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానని పేర్కొన్నారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: