రైల్లో ఎన్ని రకాల క్లాసులు ఉంటాయి.. A1, B1, H1 అంటే ఏమిటి..?

Thursday, July 24, 2025 12:00 PM Offbeat
రైల్లో ఎన్ని రకాల క్లాసులు ఉంటాయి.. A1, B1, H1 అంటే ఏమిటి..?

రైళ్లలో ప్రయాణించేవారికి ఏసీ, నాన్‌ ఏసీ క్లాసుల గురించి తెలుసు. ఏసీలో కూడా మళ్లీ 1A, 2A, 3A తరగతులు ఉంటాయి. వందే భారత్‌ అందుబాటులోకి వచ్చాక EC, CC క్లాసుల గురించి కూడా చాలా మందికి అవగాహన ఏర్పడింది. ఈ మధ్య కొన్ని రైళ్లలో 3E అనే క్లాస్‌ కనిపిస్తోంది. ఇది కాకుండా EA వంటివీ అప్పుడప్పుడూ దర్శనమిస్తుంటాయి. ఇంతకీ ఆ కోడ్‌లు ఏ తరగతులను సూచిస్తాయి.. మొత్తంగా భారతీయ రైల్వేలో ఎన్ని తరగతులున్నాయో తెలుసుకుందాం..

ఫస్ట్‌ ఏసీ (1A): భారతీయ రైల్వేలో ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ స్లీపర్‌ను 1ఏగా పేర్కొంటారు. ఇందులో 4 లేదా 2 బెర్తులతో కూడిన కంపార్ట్‌మెంట్లే ఉంటాయి. సైడ్‌ అప్పర్‌, సైడ్‌ లోయర్‌ బెర్తులేవీ ఉండవు. 2 బెర్తులుంటే కూప్‌ అని, 4 బెర్తులుంటే దాన్ని క్యాబిన్‌గా పిలుస్తారు. కంపార్ట్‌మెంట్‌కు లాక్‌ వేసుకోవచ్చు. ఒక్కో బోగీలో మొత్తం 18-24 బెర్తులు మాత్రమే ఉంటాయి. టికెట్‌ ఖరీదు ఇంచుమించు విమాన టికెట్‌ ధరకు సమానంగా ఉంటుంది. ఈ కోచ్‌లను H1, H2 అని అంటారు.

సెకండ్‌ ఏసీ (2 AC) : దీన్నే సెకండ్‌ ఏసీ లేదా టు-టైర్‌ ఏసీగా పిలుస్తారు. ఈ తరహా కోచ్‌లలో 45-54 సీట్లు ఉంటాయి. ఒక్కో క్యాబిన్‌లో ఆరు సీట్లు ఉంటాయి. మిడిల్‌ బెర్తులు ఉండవు. ఈ తరహా కోచ్‌లు A అక్షరంతో సూచిస్తారు. కోచ్‌ పొజిషన్‌ ఇచ్చేటప్పుడు A1, A2 అని ఇస్తారు. టికెట్‌ జారీ చేసేటప్పుడు A2 26 అలా ముద్రిస్తారు.

థర్డ్‌ ఏసీ (3 AC): భారతీయ రైల్వేలో మధ్యతరగతికి అందుబాటులో ఉండే ఏసీ క్లాస్‌ ఇది. స్లీపర్‌ క్లాసులో ప్రయాణించలేని వారు ఎక్కువగా ఈ తరగతిని ఎంచుకుంటారు. ఒక్కో కోచ్‌లో 64-72 బెర్తులు ఉంటాయి. ఈ కోచ్‌లపై B అనే అక్షరంతో సూచిస్తారు. కోచ్‌ పొజిషన్‌లో B1, B2 అని ఇస్తారు.

థర్డ్‌ ఎకానమీ (3E): ఇటీవల కొన్ని రైళ్లలో ఈ తరగతి దర్శనమిస్తోంది. థర్డ్‌ ఏసీ కంటే టికెట్‌ ధర తక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ తరహా కోచ్‌లలో 72-81 బెర్తులు ఉంటాయి. ఉదాహరణకు గరీబ్‌రథ్‌, చెన్నై-హౌరా మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లలో ఈ తరహా కోచ్‌లు కనిపిస్తాయి. ఈ కోచ్‌లను M1, M2తో సూచిస్తారు.

స్లీపర్‌ క్లాస్ (SL): స్లీపర్‌ కోచ్‌ల గురించి చాలా మందికి సుపరిచితమే. తక్కువ ఖర్చుతో దూర ప్రయాణం చేసే వారు ఈ తరగతిని ఎంచుకుంటూ ఉంటారు. ఇందులో 72-81 బెర్తులు ఉంటాయి. ఒక్కో క్యాబిన్‌లో 8 బెర్తులు ఉంటాయి. ఈ కోచ్‌లను S అక్షరంతో సూచిస్తారు. S1, S2, S3 ఇలా సూచిస్తారు. కొన్నిసార్లు ఆ రైలుకు అదనపు స్లీపర్‌ బోగీని ఏర్పాటు చేసినప్పుడు SE పేరుతో నంబరింగ్‌ ఇస్తారు. 

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...

ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ (EC): విమానాల్లోని బిజినెస్‌ క్లాస్‌ను ఇది పోలి ఉంటుంది. ఏసీతో కూడిన సీటింగ్ ఉంటుంది. స్లీపర్‌ బెర్తులు ఉండవు. వందేభారత్‌ రైళ్లలో కోచ్‌లు అందుబాటులోకి రావడంతో వీటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ కోచ్‌లను E అక్షరంతో సూచిస్తారు.

ఏసీ ఛైర్‌ కార్‌ (CC): ఒకవైపు మూడు వరుసలు, మరో వైపు రెండు వరుసలతో కూడిన ఛైర్లు ఉంటాయి. పగటి పూట ప్రయాణించే రైళ్లలో ఈ ఏసీ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం వందే భారత్‌లో ఉన్న కోచ్‌లు ఇవే. ఈ కోచ్‌లను C అక్షరంతో సూచిస్తారు.

ఎగ్జిక్యూటివ్‌ అనుభూతి క్లాస్‌ (EA): శతాబ్ది వంటి రైళ్లలో ఎగ్జిక్యూటివ్‌ అనుభూతి క్లాస్‌లు కనిపిస్తాయి. టికెట్‌ బుక్‌ చేసేటప్పుడు EA పేరుతో ఈ కోచ్‌లు ఉంటాయి. ఏసీతో కూడిన 56 ఛైర్లు ఉంటాయి. సినిమాలు, మ్యూజిక్‌ ఆనందించేందుకు ఎల్‌సీడీ స్క్రీన్లు ఉంటాయి. హెడ్‌ఫోన్లు ఇస్తారు. ఆటోమేటిక్‌ డోర్స్‌ ఏర్పాటు ఉంటుంది. ఈ కోచ్‌లకు K అక్షరంతో సూచిస్తారు.

విస్టాడోమ్‌ (EV): పర్యాటక ప్రాంతాలకు నడిపే రైళ్లలో విస్టాడోమ్‌ కోచ్‌లను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఈ కోచ్‌లలో అద్దాలతో కూడిన ఏర్పాటు ఉంటుంది. ఇందులో నాన్‌ ఏసీ కోచ్‌లను DV అని, ఏసీ కోచ్‌లను EVగా పేర్కొంటారు. విశాఖ- అరకు రైలులో దీన్ని గమనించొచ్చు.

సెకండ్ సిట్టింగ్ : సెకండ్‌ సిట్టింగ్‌ (2S) పేరుతో ఓ తరగతి కూడా కొన్ని రైళ్లలో ఉంటుంది. వీటిల్లో కూర్చొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వీటికీ టికెట్లు రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. ఇవి కాకుండా అన్‌ రిజర్వుడు కోచ్‌లు (UR) ఉంటాయి. వీటినే సెకండ్‌ క్లాస్‌ అని కూడా పేర్కొంటారు. వీటికి ముందుస్తు రిజర్వేషన్ ఏమీ ఉండదు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: