రికార్డులను తిరగరాసిన మహా కుంభమేళ

Monday, February 10, 2025 02:25 PM News
రికార్డులను తిరగరాసిన మహా కుంభమేళ

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళ చరిత్ర సృష్టించింది. కేవలం 24 రోజుల్లో ప్రపంచ చరిత్రలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళ జనవరి 13న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ కుంభమేళకు అన్ని రాష్ట్రాలు, ప్రధాన నగరాల నుంచి ప్రతి రోజు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. దీంతో కుంభమేళకు వెళ్లే వారి సంఖ్య అనుకున్న దానికంటే అధికంగా పెరిగింది.

అయితే గతంలో జరిగిన ఈ కుంభమేళకు దాదాపు 20 కోట్లకు పైగా ప్రజలు వెళ్లారు. ఈ సంవత్సరం మహా కుంభమేళ కావడంతో దాదాపు 40 నుంచి 50 కోట్ల మంది ప్రజలు ప్రయాగ్ రాజ్ చేరుకొని పవిత్ర స్నానాలు చేస్తారని స్థానిక యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. దానికి తగ్గట్టుగానే భారీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ప్రయాగ్ రాజ్ పరిసర ప్రాంతంలో యూపీ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద టెంట్ సిటీని నిర్మించింది. దీంతో ప్రతి రోజు లక్షల సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకొని పవిత్ర స్నానాలు చేస్తున్నారు. కాగా నేటి ఉదయానికి కుంభమేళ ప్రారంభమై 24 రోజులు అవుతుంది. అయితే ఈ 24 రోజుల్లో 41 కోట్ల మంది ప్రజలు పవిత్ర స్నానాలు చేసినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో అత్యధికంగా మౌని అమావాస్య ఒక్క రోజు 15 కోట్ల మంది ప్రజలు పవిత్ర స్నానాలు చేశారు. పంచమి సందర్భంగా 2 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారు. కుంభమేళ మరో 16 రోజులు కొనసాగనుండగా చివరి రోజు ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా మరో 5 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే కుంభమేళ ముగిసే సమయానికి మొత్తం సంఖ్య 55 కోట్లకు పైగా చేరుకునే అవకాశం కనిపిస్తుంది. మహా కుంభమేళ కోసం యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది. మొత్తం మూడు షిఫ్టుల్లో అన్ని యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్, పారిశుధ్య వ్యవస్థ ఈ కుంభమేళలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: