తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తేదీ ఫిక్స్
_(13)-1747237503.jpeg)
ప్రతి నెలా అమలు చేసే పథకాల వివరాలతో ఏడాది సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయాలని టీడీపీ పొలిట్యూరో నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా జూన్ 12న తల్లికి వందనం (పిల్లలందరికీ రూ.15వేలు), అన్నదాత సుఖీభవ (మూడు విడతల్లో రూ.20వేలు) పథకాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. అదే రోజున లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పింఛన్లు ఇవ్వనుంది.
అన్నదాత సుఖీభవ పథకం కోసం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్లు నిండిన రైతులు మాత్రమే అర్హులు. అలాగే ఈ పథకం లబ్ధి పొందడానికి భూమికి సంబంధించి పక్కా పత్రాలు ఉండాలి. భూమి యాజమాన్య పత్రాలు లేదా పట్టాదారు పాసుపుస్తకం తప్పనిసరిగా ఉండాలి. రైతు పేరు ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉండాలి. అలాగే ఆధార్ కార్డుతో అనుసంధానమైన బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి. రైతు పండించే పంటల వివరాలను అధికారుల వద్ద నమోదు చేయించాలి. అలాగే భూమిని లీజుకు తీసుకున్న కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం సాయాన్ని అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వారికి తప్పనిసరిగా కౌలు రైతు ధ్రువీకరణ పత్రం ఉండాలి. పీఎం-కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు అవుతారు. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం ఫార్మర్స్ రిజిస్ర్టీలో నమోదు చేయించుకోవాలని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు.
తల్లికి వందనం కోసం 2025-26 బడ్జెట్‌లో రూ. 9407 కోట్లు కేటాయించారు. తల్లికి వందనం పథకానికి రాష్ట్రంలోని 69.16 లక్షల మంది విద్యార్థులు అర్హులని ఏపీ విద్యాశాఖ అంచనా వేస్తోంది. అయితే తల్లికి వందనం రావాలంటే విద్యార్థులు కచ్చితంగా 75 శాతం హాజరు నిబంధనను పాటించాల్సి ఉంటుందని సమాచారం.