పాక్ కు సమాచారం చేరవేస్తున్న నేవి ఉద్యోగి అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో నేవి హెడ్ క్వార్టర్స్ లో విశాల్ యాదవ్ అనే ఉద్యోగి అరెస్ట్ కలకలం రేగింది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ISI కి కీలక సమాచారం చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై విశాల్ యాదవ్ ను రాజస్థాన్ పోలీసు ఇంటెలిజెన్స్ విభాగం అరెస్ట్ చేసింది. అతడు కొన్నేళ్లుగా గూఢచర్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కీలకమైన 'ఆపరేషన్ సిందూర్' సమయంలో కూడా సమాచారం చేరవేసినట్లు అధికారులు గుర్తించారు.
పాకిస్థానీ గూఢచార సంస్థలు నిర్వహిస్తున్న గూఢచర్య కార్యకలాపాలపై రాజస్థాన్ సీఐడీ ఇంటెలిజెన్స్ యూనిట్ నిరంతరం నిఘా ఉంచుతోంది. ఈ క్రమంలోనే విశాల్ యాదవ్ కదలికలపై అనుమానం వచ్చింది. అతడు సోషల్ మీడియా ద్వారా పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన ఒక మహిళా హ్యాండ్లర్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించారు.
ప్రియా శర్మ అనే పేరుతో పరిచయమైన సదరు మహిళా హ్యాండ్లర్, వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత కలిగిన రహస్య సమాచారం రాబట్టేందుకు విశాల్ యాదవ్‌కు డబ్బు చెల్లిస్తోందని సీనియర్ పోలీసు అధికారి విష్ణుకాంత్ గుప్తా తెలిపారు. విశాల్ యాదవ్ సెల్‌ఫోన్ నుంచి స్వాధీనం చేసుకున్న డేటా ద్వారా అతడు నేవీకి సంబంధించిన రహస్య సమాచారంతో పాటు ఇతర రక్షణ విభాగాల వివరాలను కూడా పాకిస్థానీ హ్యాండ్లర్కు అందించినట్లు స్పష్టమైంది. ప్రాథమిక దర్యాప్తులో విశాల్ యాదవ్ ఆన్లైన్ గేమ్స్‌కు బానిసై, వాటిలో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి డబ్బు అవసరమై ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తేలింది. మహిళా హ్యాండ్లర్ నుంచి క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ఖాతా ద్వారా, అలాగే నేరుగా తన బ్యాంక్ ఖాతాల్లోకి కూడా డబ్బు అందుకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం విశాల్ యాదవ్‌ను జైపూర్‌లోని సెంట్రల్ ఇంటరాగేషన్ సెంటర్లో వివిధ నిఘా సంస్థలు సంయుక్తంగా విచారిస్తున్నాయి.



