మెగా డీఎస్సీపై నారా లోకేష్ కీలక ప్రకటన

ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పలు అంశాలపై సమాధానమిచ్చారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణానికి దశల వారీగా చర్యలు తీసుకుంటామని, ‘మన బడి-మన భవిష్యత్తు’ కార్యక్రమంలో ఉపాధి హమీ ద్వారా వాటిని పూర్తిచేస్తామని చెప్పారు.
పాఠశాలలు, కాలేజీల్లో డ్రగ్స్ నివారణ కోసం ‘డ్రగ్స్ వద్దు బ్రో’ క్యాంపెయిన్ చేపడుతున్నామని, ‘ఈగల్’ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే, పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ఇచ్చిన స్టార్ రేటింగ్ ఆధారంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో 117 జీవో వల్ల 12 లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరమైనట్టు పేర్కొన్నారు. దీనిపై సభ్యుల సూచనలు తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తామని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల ద్వారా అభివృద్ధి చేస్తున్నట్టు గుర్తుచేస్తూ, అదే విధంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యేలకు సూచించారు.