అప్సరను చంపిన పూజారి.. సంచలన తీర్పునిచ్చిన కోర్టు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సరూర్ నగర్ అప్సర హత్య కేసులో పూజారి సాయికృష్ణకి కోర్టు జీవిత ఖైదు విధించింది. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి పూజారి సాయి చంపేశాడు. శంషాబాద్ లో అప్సరను చంపి కారులో తీసుకువచ్చి వాటర్ ట్యాంకులో పూడ్చిపెట్టాడు. నాలుగేళ్ల పాటు అప్సరతో ప్రేమ కార్యకలాపాలు జరిపాడు. పెళ్లి చేసుకోమని వెంటపడడంతో అప్సరను కిరాతకంగా చంపి పూడ్చి పెట్టాడు. ఈ ఘటనలో తాజాగా పూజారి సాయికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది.
సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడు సంవత్సరాలు అదనపు జైలు శిక్ష విధించింది. గతంలో పోలీసుల కస్టడీలో సాయి హత్య చేసేందుకు గల కారణాన్ని తెలిపాడు. పెళ్లి చేసుకోవాల్సిందిగా అప్సర చేస్తున్న వేధింపులు భరించలేకనే హత్య చేసినట్లు తెలిపాడు. పెళ్లి చేసుకోకపోతే తన పరువును బజారుకు ఈడుస్తానని బెదిరించినట్లు చెప్పాడు. ఆమె వివాహేతర సంబంధం గురించి బయటపెడితే తన పరువు పోతుందనే ఉద్దేశంతో అప్సరను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.