పోలీస్ స్టేషన్ కు చేరిన కోడి పంచాయితీ
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని గొల్లగూడెంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గంగమ్మ అనే మహిళ తన ఇంట్లో ఓ కోడిని పెంచుకుంటోంది. అయితే పక్కింటి రాకేష్ ఇంటి వద్ద గడ్డివాములో గింజలు తింటుందని కోడిని కర్రతో కొట్టాడు. ఈ ఘటనలో కోడి కాలు విరగడంతో గంగమ్మ నకిరేకల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. `రాకేష్ కు శిక్ష పడాలి నాకు డబ్బులు వద్దు' అని ఆమె డిమాండ్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
కోడికి జరిగినట్లు ఊళ్లో ఏ కోడికి జరగకూడదు అని గంగమ్మ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. గంగమ్మకు సర్ది చెప్పేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా వినలేదు. దీంతో చేసేది ఏమీ లేక నకిరేకల్ పోలీసులు.. గ్రామానికి వచ్చి పంచాయతీని పరిష్కరిస్తామని సర్ది చెప్పారు. ప్రస్తుతానికి ఇంటికి వెళ్లి కోడికి వైద్యం చేయించుకోమని చెప్పి గంగమ్మను పంపించేశారు. ఈ కోడి పంచాయితీనీ ఎలా పరిష్కరించాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

.jpg)
.jpg)
.jpg)