వందలాది ఉద్యోగులను తొలగించిన ఇన్ఫోసిస్
-1739611365.jpg)
ఇన్ఫోసిస్ వందల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపింది. మైసూరు క్యాంప్‌సలో 400 మందికిపైగా ట్రెయినీ ఉద్యోగులను ఒకేరోజు తొలగించింది. దీనిపై కేంద్ర కార్మికశాఖ స్పందించింది. ఆ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ కమిషన్ కార్యాలయం రాష్ట్రానికి శుక్రవారం లేఖ పంపింది. సామూహికంగా ఉద్యోగుల తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకోవాలని లేఖలో కోరింది.
ఇటీవల ఉద్యోగులను ఒకేసారి తొలగించిన ఇన్ఫోసిస్ యాజమాన్యం వారందరినీ వెంటనే క్యాంపస్ నుంచి సెక్యూరిటీ సిబ్బంది ద్వారా బయటకు పంపేసింది. దీనిపై బాధిత ఉద్యోగులు కేంద్ర కార్మికశాఖకు ఫిర్యాదు చేశారు. వారితోపాటు ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ఎన్‌ఐటీఈఎఎస్) కూడా ఫిర్యాదు చేసింది. దీనిపై కేంద్ర కార్మికశాఖ స్పందించింది. కాగా, రాత్రివేళ బయటకు పంపితే ఎక్కడకు వెళ్లాలని ఒక రాత్రి హాస్టల్‌లో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతి బతిమలాడినా కంపెనీ నిరాకరించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు క్యాంపస్ బయట రాత్రంతా రోడ్డుపైనే గడిపిన ఫోటోలు సొషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.