డీఈవో ఇంట్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు

బీహార్ రాష్ట్రం వెస్ట్ చంపారన్ జిల్లాలో ఓ డీఈవో ఇంట్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో కట్టల కట్టల డబ్బు బయటపడింది. బీహార్ యాంటీ కరప్షన్ వింగ్ అయిన స్పెషల్ విజిలెన్స్ యూనిట్ (ఎస్వీయూ) గురువారం బెట్టయ్యాలో ఉన్న డీఈవో రజనీకాంత్ ప్రవీణ్ కార్యాలయం, ఇంట్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా డీఈవో ఇంట్లోని బెడ్లు, సోఫాల కింద కట్టల కొద్దీ డబ్బు బయటపడింది.
ఇంట్లో ఉన్న ప్రతీ బెడ్ కింద నోట్ల కట్టలు దొరికినట్లు విజిలెన్స్ అధికారులు చెప్పారు. డబ్బు ఎంతుందో లెక్కించడానికి స్థానిక బ్యాంకు నుంచి మనీ కౌంటింగ్ మెషీన్ ను తెప్పించారు. బీహార్లోని విద్యాశాఖతో పాటు ఇతర అధికారులు అక్రమాస్తులు కూడబెట్టారన్న సమాచారంతో దర్భంగా, మధుబని, వెస్ట్ చంపారన్, సమిస్థిపూర్ జిల్లాల్లో ఎస్వీయూ అధికారులు దాడులు చేశారు. ఈ క్రమంలోనే డీఈవో రజనీకాంత్ ప్రవీణ్ అద్దెకు ఉంటున్న ఇంట్లో భారీగా డబ్బు పట్టుబడింది. ఆయన స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.1.87 కోట్ల మేర ఉంటుందని తెలుస్తోంది. కాగా పట్టుబడిన నోట్ల కట్టలను ఇంకా లెక్కిస్తుండటంతో మొత్తం ఎంత డబ్బు ఉందో తర్వాత వెల్లడిస్తామని విజిలెన్స్ అధికారులు చెప్పారు.