విశాఖలో టీసీఎస్.. 10వేల మందికి ఉద్యోగాలు
_(11)-1744943224.jpeg)
దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు సంబంధించి ఏపీ కేబినెట్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో టీసీఎస్‌కు ఏకంగా 21.16 ఎకరాల భూమిని నామమాత్రపు ధరతో సంవత్సరానికి ఎకరా కేవలం 99 పైసలకే కేటాయించేందుకు నిర్ణయించింది. గుజరాత్‌లో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టాటా మోటార్స్‌కు 99 పైసలకే భూమిని కేటాయించిన విధానాన్నే చంద్రబాబు సర్కార్ అనుసరించినట్లు తెలుస్తోంది.
టీసీఎస్ రాకతో విశాఖపట్నంలో ఐటీ విప్లవం మొదలవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా టీసీఎస్ దాదాపు రూ. 1,370 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తద్వారా సుమారు 10,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. IT శాఖ మంత్రి నారా లోకేష్ గతేడాది అక్టోబర్‌లో ముంబైలో టీసీఎస్ ఉన్నతాధికారులతో సమావేశమై విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆహ్వానించారు. దీనికి కొనసాగింపుగా ఈ కేటాయింపు జరిగింది. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో ఐటీ రంగంలో కనీసం 5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికకు హాజరైన చంద్రబాబు నాయుడు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీసీఎస్ విశాఖపట్నంలో 90 రోజుల్లో అద్దె భవనం నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. అత్యాధునిక శాశ్వత ప్రాంగణం నిర్మాణం పూర్తి కావడానికి 2 నుంచి 3 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఈ ప్రాంగణంలో 10,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.