వినాయక చవితి రోజు చేయాల్సిన పనులు ఇవే..
హిందు సంప్రదాయంలో జరుపుకునే అతి పెద్ద పండుగ గణేశ్ చతుర్థి. ఈ వినాయ చవితి పండుగ సందర్భంగా ఆచరించే గణేశ్ నవరాత్రులు భాద్రపద మాసం చతుర్థి తిథి నుంచి ప్రారంభమై అనంత చతుర్దశి తిథి వరకు కొనసాగుతాయి. ఈ 9 రోజుల పాటు ఘనంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఆచరించిన తర్వాత 10వ రోజు ఘనంగా నిర్వహించే గణేశ్ నిమజ్జనంతో వినాయక చవితి పండుగ ముగుస్తుంది.
తెలుగు పంచాంగం ప్రకారం చూస్తే భాద్రపద శుద్ధ చవితి తిథి ఆగస్టు 26 మంగళవారం మధ్యాహ్నం 1:54 గంటలకు ప్రారంభమైంది. ఆగస్టు 27వ తేదీ బుధవారం మధ్యాహ్నం 03:44 గంటల వరకు ఉంటుంది. హిందూ సంప్రదాయం ప్రకారం ఉదయ తిథి పాటిస్తాం కాబట్టి ఆగస్టు 27న వినాయక చవితి పండుగ జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. వినాయక పూజకు ఆగస్టు 27న ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 01:41 గంటల మధ్యలో అత్యంత శుభప్రదంగా ఉంది.
వినాయక చవితి పండుగ రోజు ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటిని, పూజా మందిరాన్ని పసుపు, కుంకుమ, మామిడాకులు, పూల తోరణాలతో అలంకరించాలి. అనంతరం వినాయకుడి విగ్రహాన్ని పూజామందిరంలో తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య భాగంలో ఏర్పాటు చేసుకోవాలి. ఒక ప్లేట్ లేదా వస్త్రంపై బియ్యం పోసి వాటిపై తమలపాకులు అలంకరించాలి. ఇప్పుడు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దీపారాధన చేయాలి. ఒకవేళ వీలైతే జిల్లేడు వత్తులతో దీపం పెడితే వినాయకుడి అనుగ్రహంతో ఏడాది మొత్తం శుభ ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతారు.



