ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా.. గగ్గోలుపెడుతున్న ప్రొడ్యూసర్

'తండేల్' సినిమాకు పైరసీ భూతం తీవ్రంగా దెబ్బ కొడుతోంది. ఈ సినిమాకు సంబంధించి క్వాలిటీ పైరసీ ప్రింట్ తొలి రోజే ఆన్ లైన్లోకి వచ్చేసింది. ఏపీలో ఒక చోట ఆర్టీసీ బస్సులో 'తండేల్' పైరసీ వెర్షన్‌ను ప్రదర్శించారు. ఈ విషయం 'తండేల్' నిర్మాతల దృష్టికి కూడా వచ్చింది. ఒక న్యూస్ పోర్టల్‌లో దీనికి సంబంధించిన న్యూస్ చూసిన నిర్మాత బన్నీ వాసు ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకల్ల నారాయణరావుకు ఫిర్యాదు చేశారు.
సర్వీస్ సనంబర్ 3066 బస్సులో తండేల్ పైరసీ వెర్షన్‌ను ప్రదర్శించినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇది దారుణమని, దానిపై కఠిన చర్యలు చేపట్టాలని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్‌కు బన్నీ వాసు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో పైరసీ వెర్షన్లు ప్రదర్శించడం కొత్తేమీ కాదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బస్సు సిబ్బంది యథేచ్ఛగా పైరసీ వెర్షన్లను వేసేస్తున్నారు. మరీ రిలీజై రెండు మూడు రోజులు కాకముందే ఇలా ఆర్టీసీ బస్సులో పైరసీ వెర్షన్ వేయడం దారుణం. ఈ పరిణామంతో మొత్తంగా ఆర్టీసీలో కదలిక వస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. విజయవాడలో జరిగిన సక్సెస్ టూర్‌లో భాగంగా పైరసీ చేసిన వాళ్లకు, చూసే వాళ్లకు బన్నీ వాసు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. కొందరు పైరసీలో సినిమా చూద్దామని వెయిట్ చేస్తున్నారని, వాళ్లు ఆ ప్రయత్నాలు మానుకోవాలని వాసు అన్నాడు.