17ఏళ్ళ తర్వాత మళ్ళీ బుల్లితెరపై మాజీ కేంద్ర మంత్రి
మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మళ్లీ బుల్లితెరపై రీఎంట్రీకి సిద్ధమయ్యారు. ఒకప్పుడు స్టార్ ప్లస్ లో ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్ 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ' సీక్వెల్ వెర్షన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సీరియల్ లో 'తులసి విరాణి' పాత్రను తిరిగి ఆమెనే చేయమని మేకర్స్ సంప్రదించగా స్మృతి ఇరానీ అంగీకరించారు. ఈ మేరకు తాజాగా సీరియల్ ప్రోమో విడుదల చేశారు. దాదాపు 17ఏళ్ళ తర్వాత ఆమె మళ్ళీ బుల్లితెరపై కనిపించనుంది.
క్యుంకి సాస్ భీ కబీ బహు థీ సీరియల్ భారత టెలివిజన్ చరిత్రలో ఒక సంచలనం సృష్టించింది. దాదాపు 8 సంవత్సరాలు (2000 నుంచి 2008 వరకు) ప్రసారమైన ఈ సీరీయల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2000 ఎపిసోడ్‌లకు పైగా సాగింది. ఒక కుటుంబ కథగా దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లోనూ భాగమైపోయింది. ఈ సీరియల్ ద్వారానే స్మృతి ఇరానీ జాతీయ స్థాయిలో స్టార్‌డమ్ సంపాదించారు. తులసి విరాణి పాత్ర ఆమెకు ఇంటింటికీ సుపరిచితం చేసింది. ఇప్పుడు ఈ సీరియల్ కి సీక్వెల్ వస్తుండడంతో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ 'బాలాజీ టెలిఫిల్మ్స్' నిర్మించనుంది.



