నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుని పదేళ్లు ఎంజాయ్ చేశాడు.. చివరికి..

ఒకరికి తెలియకుండా ఒకరిని ఏకంగా నలుగురిని పెళ్లి చేసుకున్న ఘనుడిని ఫేస్ బుక్ అడ్డంగా పట్టించింది. కేరళలోని కాసర్గోడ్ సమీపంలోని వెల్లరికున్ను ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల దీపు ఫిలిప్ మహిళలను మోసం చేసి పెళ్లి చేసుకోవడం ఒక హాబీగా మార్చుకున్నాడు. తనకు అమ్మాయి నచ్చితే ఆమెను ఎదో విధంగా ట్రాప్ చేస్తాడు. పెళ్ళికి ఒప్పిస్తాడు. ఆమెతో కొన్నిరోజులు కాపురం చేస్తాడు. తరువాత అక్కడ నుంచి బిచాణా ఎత్తేస్తాడు.
మరో ప్రాంతంలో దుకాణం తెరుస్తాడు. తరువాత అక్కడ ఇంకో అమ్మాయి. ఇలా పదేళ్లుగా నలుగుర్ని పెళ్ళిచేసుకుని మొదటి ఇద్దరినీ వదిలేసి చివరి ఇద్దరితో ఒకరికి తెలియకండా ఒకరితో మేనేజ్ చేసేస్తున్నాడు. నాల్గవ భార్య తనను ఇబ్బంది పెట్టబోతోందని తెలియలేదు. కొన్నాళ్ళు బాగానే గడిచింది. దీపు ఫిలిప్ రెండో భార్య, నాలుగో భార్య ఫేస్ బుక్ లో పరిచయం అయ్యారు. ఒకరితో ఒకరికి మంచి స్నేహ ఏర్పడింది. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునే సమయంలో ఇద్దరి భర్త ఒక్కలానే ఉన్నట్టు అనుమానం కలిగింది. ఇద్దరూ మరింత వివరంగా ఫోటోలు షేర్ చేసుకుని పరిశీలిస్తే వాడే వీడు అని తేలిపోయింది. నాలుగో భార్య లబోదిబో మని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అయ్యగారిని తమదైన స్టైల్ లో దర్యాప్తు చేస్తే నాలుగు పెళ్లిళ్ల వ్యవహారం బయటపడింది. దీంతో దీపు ఫిలిప్ ను కటకటాల్లోకి నెట్టారు పోలీసులు.