రిమోట్ కోసం గొడవ.. పెళ్ళైన ఆరు నెలలకే సాప్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

టీవీ రిమోట్ కోసం భార్యా భర్తల మధ్య గొడవతో సాప్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని ప్రశాంతిహిల్స్ లో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా తోర్ మామిడికి చెందిన కమలాపురం దేవిక, మంచిర్యాలకు చెందిన సద్గుర్తి సతీశ్ చంద్ర ఒకే సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఇరువైపు కుటుంబాలను ఒప్పించి గతేడాది ఆగస్టు 23న గోవాలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.
ఆ తర్వాత రాయదుర్గం పరిధిలోని ప్రశాంతిహిల్స్ లోని ఓ అపార్ట్మెంట్ లో కాపురం ఉంటున్నారు. పెళ్ళైన కొద్ది రోజులకే భార్య భర్తలిద్దరి మధ్య మస్పర్థలు, గొడవలు మొదలయ్యాయి. ఇలా ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో దేవిక, సతీష్ ఇంట్లో టీవీ రిమోట్ కోసం గొడవ పడ్డారు. దీంతో మనస్థాపానికి గురైన దేవిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఆ తర్వాత సతీష్ కూడా బయటకు వెళ్లి అర్ధరాత్రి 12 గంటల తర్వాత తిరిగి వచ్చాడు. ఇంటికొచ్చిన సతీష్ దేవిక గది తలుపులను పెట్టి ఉంచడంతో నిద్రపోయిందనుకొని సతీష్ మరో గదిలోకి వెళ్లి నిద్రపోయాడు.
ఆ తర్వాత ఉదయం 10 గంటలకు ఆఫీస్ కి వెళ్లాల్సి ఉండగా అప్పటికీ తలుపు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన సతీష్ తలుపు బద్దలు కొట్టి చూడగా దేవిక ఫ్యాన్ కి ఉరేసుకొని కనిపించింది. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భర్త సతీష్ కట్న వేధింపులు తట్టుకోలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని దేవిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.