మీర్ పేట మర్డర్ ను మించిన ఘటన.. 20 ఏళ్లుగా ఫ్రిజ్ లో పుర్రె, ఎముకలు

మీర్పేట్ లో భార్యను చంపి, 2 రోజులపాటు ఉండికించి, కాల్చి ముక్కలు చేసిన ఘటనను మించిన కేసు కేరళలో ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. ఏకంగా 20 ఏళ్లపాటు ఓ ఇంటి ఫ్రిజ్ లో మానవ పుర్రె, ఎముకలు భద్రంగా దాచినట్లు గుర్తించారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఖాళీగా ఉన్న ఇంట్లో జరిగిన ఈ ఘటనలో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని ఎర్నాకుళం జిల్లా చొట్టనిక్కర ప్రాంతంలోని ఒక ఇంట్లో మానవ పుర్రె, ఎముకలు లభించాయి. ఈ ఇల్లు దాదాపు 20 సంవత్సరాలుగా ఖాళీగా ఉండగా ఇది సంఘ వ్యతిరేక శక్తులకు నిలయంగా మారింది. స్థానిక సర్పంచ్ ఇందిరా ధర్మరాజ్ ఆ ఇంట్లో ఏదో జరుగుతున్నట్లు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఇంటిని సోదా చేయగా ఫ్రిజ్ లోపల మూడు ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసిన మానవ పుర్రె, ఎముకలు బయటపడ్డాయి. దీంతో పాటు ఆ ఇంట్లో చాలా మానవ అవశేషాలు దొరికాయి. చాలా కాలంగా ఇక్కడ సీక్రెట్ మర్డర్స్ జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇంటి యజమాని 74 ఏళ్ల డాక్టర్ ఫిలిప్ జాన్‌ను పోలీసులు విచారించారు. ప్రస్తుతం ఆయన కేరళ రాష్ట్రంలోని వైట్టిలలో నివసిస్తున్నారు. పోలీసులు సంఘటన గురించి ఆరాతీయగా తన పిల్లలు విదేశాల్లో నివసిస్తున్నారని, ఆ ఇల్లు చాలా సంవత్సరాలుగా ఖాళీగానే ఉంచుతున్నట్లు జాన్ తెలిపారు. ఆ అవశేషాలు ఇంటికి ఎలా వచ్చాయి? ఇంటి యజమానికి దానితో ఏదైనా సంబంధం ఉందా అనే విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మానవ అవశేషాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. ఈ దర్యాప్తులో ఆ పుర్రె, ఎముకలు ఎంత పాతవో స్పష్టంగా తెలియనుంది. సంఘటనకు సంబంధించి ఎవరికైనా ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే దానిని తమకు అందించాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.