పొరుగింటికి వెళ్లిందని.. 5 ఏళ్ల కూతురిని చంపి ముక్కలు చేసిన తండ్రి

Friday, March 7, 2025 04:00 PM Crime
పొరుగింటికి వెళ్లిందని.. 5 ఏళ్ల కూతురిని చంపి ముక్కలు చేసిన తండ్రి

తనకు పడని వారి ఇంటికి వెళ్లిందని కన్న కూతురిని కసాయి తండ్రి దారుణంగా హత్య చేసి ఆమె శరీరాన్ని ముక్కలు చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్‌లో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 25వ తేదీన చిన్నారి కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. చిన్నారి కోసం వెతుకుతున్న క్రమంలో ఆమె శరీర భాగం ఒకటి కనిపించగా మరుసటి రోజు మిగితా భాగాలన్ని లభ్యమయ్యాయి. అప్పటితో చిన్నారి హత్యకు గురైనట్లు ఓ స్పష్టత వచ్చిందని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఎవరు హత్య చేశారని అనుమానితుల్ని ప్రశ్నిస్తున్న తరుణంలో చిన్నారి తండ్రి మోహిత్ కనిపించకుండా పోయాడు. తన ఫోన్‌ని భార్యకు ఇచ్చి తాను ఎక్కడికో వెళ్లిపోయాడని పోలీసులు చెప్పారు. చిన్నారి కనిపించకుండా పోయే ముందు ఈ తతంగం జరిగిందని పేర్కొన్నారు. అయితే తండ్రి దొరికిన తర్వాత అతన్ని ప్రశ్నించగా తానే హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసినట్లు అంగీకరించాడని తెలిపారు.

మోహిత్, పొరుగింటిలో ఉండే రాముతో ఒకప్పుడు మంచి స్నేహం ఉండేది. తరచూ ఒకరింటికి ఒకరు వస్తూ పోతుండే వాళ్లు. కొన్ని రోజుల క్రితం వీరిద్దరి మధ్య వివాదం వచ్చి విడిపోయారు. దీంతో మోహిత్ తన కూతురిని రాము ఇంటికి వెళ్లొద్దంటూ చాలాసార్లు హెచ్చరించాడు. ఆ చిన్నారి అక్కడికే వెళ్లి ఆడుకునేదట. దీంతో చిన్నారి రాము ఇంటి నుంచి వస్తుండగా గమనించిన మోహిత్ కోపంతో ఆమెను బండి మీద ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమె బట్టలతోనే గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆమె శవాన్ని పొలాల్లో పడేశాడు. ఇంత దారుణానికి ఒడిగట్టిన మోహిత్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: