ఎన్టీఆర్‌ జిల్లాలో దారుణం, మాట్లాడటం లేదని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు

Monday, March 3, 2025 10:39 AM Crime
ఎన్టీఆర్‌ జిల్లాలో దారుణం, మాట్లాడటం లేదని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు

ఎన్టీఆర్‌ జిల్లాలో వివాహేతర సంబంధం ఓ మహిళ హత్యకు దారి తీసింది. ముగ్గురు ఆడ పిల్లలకు తల్లిని దూరం చేసింది. ఎన్టీఆర్‌ జిల్లా పటమట పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ రూరల్‌ మండలం నిడమానూరుకు చెందిన కావ్య (23)కు, బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన ప్రకాష్‌రావుతో ఆరేళ్ల కిందట పెళ్ళి జరిగింది. వీరు నిడమానూరులో అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు. వీరికి ముగ్గురు(5, 4, 2 ఏళ్ల) ఆడ పిల్లలు. భర్త వంట పనులు చేస్తుండగా భార్య ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలో నిడమానూరుకు చెందిన లాం వాసుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. 

ఆరు నెలల కిందట ఈ సంబంధం భర్తకు తెలియడంతో ఆమెను ఉద్యోగం నుంచి మాన్పించారు. కావ్య అప్పటి నుంచి వాసుతో మాట్లాడడం మానేసింది. అప్పటి నుంచి వాసు కావ్యను బెదిరించడం మొదలు పెట్టాడు. శనివారం సాయంత్రం భర్త ప్రకాష్‌రావు బెంజ్‌సర్కిల్‌ సమీపంలోని ఓ హోటల్‌కు వంట పనికి వెళ్లాడు. కావ్య పిల్లలతో పాటు తన తాతతో కలిసి ఇంట్లో పడుకున్నారు. లాం వాసు అర్ధరాత్రి 12 గంటల సమయంలో కావ్య ఇంటికి చేరుకుని ఆమెతో గొడవ పడ్డాడు. 

చున్నీతో కావ్య మెడకు బిగించి హత్య చేశాడు. పక్క గదిలో ఉన్న ఆమె తాతయ్య చూసి కేకలు వేయగా అక్కడ నుంచి పరారయ్యాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త ప్రకాష్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పటమట సీఐ వి.పవన్‌ కిషోర్‌ తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: