కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. మరికొన్ని చోట్ల ఎండలు

Weather Published On : Wednesday, May 14, 2025 08:00 AM

ఏపిలో రానున్న రెండు రోజులు భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొనన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీవర్షాలు, మరికొన్ని చోట్ల ఎండలు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. వాతావరణ మార్పుల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

బుధవారం(14-05-25) అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, కోనసీమ, పల్నాడు , గుంటూరు , ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు. గురువారం (15-05-25) అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, వైఎస్సార్, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే రేపు ఉష్ణోగ్రతలు 41-43°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు. విజయనగరం-3, పార్వతీపురంమన్యం-8, తూర్పుగోదావరి-1 మండలాల్లో తీవ్రవడగాలులు (12), మరో 35 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు. 

మంగళవారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో 43.2°C, అల్లూరి సీతారామరాజు జిల్లా కొండాయిగూడెం 42.9°C, నెల్లూరు జిల్లా దగదర్తి, ప్రకాశం జిల్లా దరిమడుగులో 42.8°C, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి, ఏలూరు జిల్లా రాజుపోతెపల్లె, పల్నాడు జిల్లా అమరావతిలో 42.7°C, బాపట్ల జిల్లా వల్లపల్లిలో 42.4°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని 16 ప్రాంతాల్లో, పల్నాడు 10 , ఏలూరు 8, ప్రకాశం 8, తిరుపతి 8 సహా ఇతర చోట్ల కలిపి 74 ప్రాంతాల్లో 41°C కు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వివరించారు. ఎండతీవ్రంగా ఉండి బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి, కర్చీఫ్ కట్టుకోవాలి, గొడుగు ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని సూచించారు.