క్రికెట్ ఆడని సమయంలో అవే నన్ను ఆదుకున్నాయి..

Sports Published On : Saturday, May 16, 2020 10:56 AM

రాబోయే ఐదు సంవత్సరాలు క్రికెట్‌కే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు టీమిండియా టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ అన్నాడు. శుక్రవారం శ్రీశాంత్ Helo ద్వారా మరోసారి అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా క్రికెట్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 

కఠిన సమయాలు అందరికీ ఎప్పటికీ ఉండవని చెప్పిన శ్రీశాంత్ తన ఆథ్మకథను ఐదేళ్ల తర్వాత విడుదల చేయనున్నట్లు తెలిపాడు. తన ఆత్మకథలో జీవితం, క్రికెట్, డిప్రెషన్ వంటి అన్ని పాయింట్లు తప్పక ఉంటాయని అన్నాడు. కోపంగా ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని శ్రీశాంత్ సూచించాడు.

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదైనా జరగవచ్చని చెప్పిన శ్రీశాంత్... మైకేల్ జోర్డాన్ దగ్గర శిక్షణ తీసుకుంటానని అనుకోలేదని చెప్పాడు. అతని వద్ద శిక్షణ తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. తన జీవితంలో సమస్యలను ఎలా ఎదుర్కొవాలో నేర్చుకున్నట్లు శ్రీశాంత్ చెప్పాడు. 

ఈ రోజుల్లో ప్రతిదీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని... మిమ్మల్ని ఎవరూ ఆపలేరని అన్నాడు. మీరు ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే లాక్ డౌన్ సమయంలో అద్భుతాలు చేయవచ్చని శ్రీశాంత్ అన్నాడు. ఇక, క్రికెట్‌లోకి తన పునరాగమన రికార్డు ఏమిటి? అన్న ప్రశ్నకు గాను 100 వన్డే వికెట్లతో పాటు టెస్టుల్లో కూడా కొన్ని వికెట్లు తీయాలని శ్రీశాంత్ చెప్పాడు. 

తాను ఎర్ర బంతి బౌలర్ అని నమ్ముతానని చెప్పిన శ్రీశాంత్... రికార్డుల కంటే జట్టు గెలుపు కోసం ప్రయత్నిస్తానని చెప్పాడు. అంతేకాదు జట్టు స్ఫూర్తిని కూడా నమ్ముతున్నానని తెలిపాడు. తనను క్రికెట్‌కు తన మామయ్య పరిచయం చేశాడని చెప్పిన శ్రీశాంత్ పలు క్రికెట్ రికార్డుల నుంచే తాను ప్రేరణ పొందానని చెప్పాడు. 

క్రికెట్ లేని సమయాల్లో తనని ఆర్ధికంగా సినిమాలే ఆదుకున్నాయని, ప్రస్తుతం కూడా ఒక మరాఠీ సినిమా చేస్తున్నానని, గతంలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌‌లలో నిర్మించిన పలు సినిమాల్లో నటించానని శ్రీశాంత్ తెలిపాడు. 18 రోజుల షూటింగ్ అని చెప్పడంతో ఓ మరాఠీ సినిమా కూడా ఒప్పుకున్నానని... ఆ సినిమా పేరు 'ముంబై క వడపావ్' అని శ్రీశాంత్ తెలిపాడు.