టీమిండియాలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అతడే!
ప్రస్తుత భారత జట్టులో తన అత్యుత్తమ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మనేనని యువ క్రికెటర్, అండర్-19 భారత జట్టు కెప్టెన్ ప్రియమ్ గార్గ్ తెలిపాడు. బుధవారం హలో యాప్ లైవ్‌లో ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయిన ఈ యువ క్రికెటర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ప్రేక్షకులు లేకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.
అండర్-19 బెస్ట్ కెప్టెన్ మహమ్మద్ కైఫ్ అని, స్టెడ్జింగ్ ఆటలో భాగమని, 8-12సంవత్సరాల మధ్య క్రికెట్లో అడుగుపెట్టడం మంచిదని సలహా ఇచ్చాడు. సహచర ఆటగాడు రవి బిష్ణోయ్ ఎంతో కష్టపడతాడని, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఏం చేసిన వంద శాతం న్యాయం చేస్తాడని తెలిపాడు.
బుమ్రా, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ఇష్టమని, బెస్ట్ ఓపెనర్ రోహిత్ శర్మ అని చెప్పాడు. రాత్రికి రాత్రే ఎవరూ పెద్ద స్టార్ అయిపోరు. ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే స్టార్ అవుతారు అని ప్రియమ్ గార్గ్ చెప్పాడు.
క్రీడాకారులకు ఫిట్ నెస్ ఎంతో ముఖ్యమని, అలాగే ప్రతి ఒక్కరూ ఫిట్ నెస్ తో ఆరోగ్యంగా ఉండాలని సూచించాడు. అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో ఆద్యాంతం అదరగొట్టిన ప్రియమ్ గార్గ్ నేతృత్వంలోని యువభారత్.. ఫైనల్లో మాత్రం బంగ్లాదేశ్ చేతిలో ఓడింది. ఇక ఐపీఎల్ 2020 సీజన్ వేలంలో ప్రియమ్ గార్గ్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. కోటి 90 లక్షలకు కొనుగోలు చేసింది.