DC vs SRH: ముంబైతో ఫైనల్ పోరుకు ఢిల్లీ, సన్‌రైజర్స్‌‌పై 17 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

Sports Published On : Friday, December 11, 2020 02:15 PM

ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి ఆఖరి పోరుకు  అర్హత సాధించింది. ఆదివారం జరిగిన ఐపీఎల్‌ క్వాలిఫయర్‌-2లో 17 పరుగులతో హైదరాబాద్‌ను (DC vs SRH Highlights Dream11 IPL 2020 Qualifier 2) చిత్తుచేసింది. ఐపీఎల్‌ చరిత్రలో ఎట్టకేలకు ఆ జట్టు (Delhi Capitals) తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించింది. కాగా ఐపీఎల్‌ చరిత్రలో ఎనిమిదోసారి టాప్‌–2 జట్లే టైటిల్‌ పోరుకు అర్హత పొందాయి.డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో (Mumbai Indians) అమీతుమీ తేల్చుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలిసారిగా రెడీ అయింది. 

ఆదివారం జరిగిన రెండో క్వాలిఫయర్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఢిల్లీ 17 పరుగుల తేడాతో (Delhi Capitals Beat Sunrisers Hyderabad by 17 Runs) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (50 బంతుల్లో 78; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు.  ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్టొయినిస్‌ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, సిక్స్‌), హెట్‌మైర్‌ (22 బంతుల్లో 42 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడారు. తర్వాత లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులే చేసి ఓడింది. కేన్‌ విలియమ్సన్‌ (45 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) పరువు నిలిపే పోరాటం చేశాడు. స్టొయినిస్‌ (3/26), రబడ (4/29) హైదరాబాద్‌ను దెబ్బ తీశారు.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌పై ( Sunrisers Hyderabad) రెండు సార్లు ఛేజింగ్‌లో ఓడిన ఢిల్లీ.. కీలక మ్యాచ్‌లో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకుంది. గాయపడ్డ పృథ్వీ షా స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన స్టొయినిస్‌.. ధవన్‌తో కలిసి జట్టుకు శుభారంభాన్నిచ్చాడు. హైదరాబాద్‌ ఫీల్డింగ్‌ తప్పిదాలు కూడా క్యాపిటల్స్‌కు కలిసొచ్చాయి. ఓపెనర్లు ఎడాపెడా బౌండ్రీలు బాదడంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. సందీప్‌ ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన స్టొయినిస్‌.. హోల్డర్‌ వేసిన నాలుగో ఓవర్‌లో 4,4,6,4 బాదాడు. మరో ఎండ్‌ ధవన్‌ వరుస ఓవర్లలో 4,4.. 6,4 అందుకోవడంతో పవర్‌ ప్లే ముగిసేసరికి ఢిల్లీ వికెట్‌ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు 86 పరుగులు జోడించాక స్టొయినిస్‌ను రషీద్‌ ఔట్‌ చేశాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (21) వేగంగా ఆడలేకపోయినా.. ఆ తర్వాత వచ్చిన హెట్‌మైర్‌ దంచి కొట్టాడు. 26 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న ధవన్‌ ఆఖర్లో కాస్త నెమ్మదించగా.. చివరి రెండు ఓవర్లలో సన్‌రైజర్స్‌ బౌలర్లు ఒక్క బౌండ్రీ కూడా ఇవ్వకుండా కట్టడి చేయడంతో ఢిల్లీ మరింత భారీ స్కోరు చేయలేకపోయింది.  ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బౌలర్లలో హోల్డర్‌ (1/50), నదీమ్‌ (0/48) భారీగా పరుగులిచ్చుకున్నారు.

190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ జట్టు అనుభవజ్ఞుడైన అశ్విన్‌ తొలి ఓవర్లోనే 12 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ జోరు ఇక షురూ అనుకుంటున్న తరుణంలోనే రబడ రెండో ఓవర్‌ తొలి బంతికే  వార్నర్‌ (2)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఐదో ఓవర్‌ వేసిన స్టొయినిస్‌... ప్రియమ్‌ గార్గ్‌ (17; 2 సిక్స్‌లు)ను బౌల్డ్‌ చేశాడు. రెండు బంతుల వ్యవధిలో మనీశ్‌ పాండే (14 బంతుల్లో 21; 3 ఫోర్లు)ను ఔట్‌ చేశాడు. దీంతో 44 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయిన హైదరాబాద్‌ కష్టాల్లో పడింది. కేన్‌ విలియమ్సన్, హోల్డర్‌ కాసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. క్రీజులో కుదురుకున్నాక విలియమ్సన్‌  చెలరేగాడు.

హోల్డర్‌ (11) ఔటయ్యాక... అబ్దుల్‌ సమద్‌ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి లక్ష్యాన్ని అందుకునేందుకు విలియమ్సన్‌ విఫలయత్నం చేశాడు. జట్టు స్కోరు 12.1 ఓవర్లలో వంద పరుగులకు చేరింది. ఈ దశలో పరుగుల వేగం పెరగడంతో ఢిల్లీ శిబిరం లో కలవరం మొదలైంది. 19 బంతుల్లో 43 పరుగులు చేయాల్సిన తరుణంలో విలియమ్సన్‌ను స్టొయినిస్‌ ఔట్‌ చేశాడు. రబడ ఒకే ఓవర్లో సమద్, రషీద్‌ ఖాన్‌లను పెవిలియన్‌ చేర్చాడు. విజయానికి 12 బంతుల్లో హైదరాబాద్‌ 30 పరుగులు చేయాల్సి ఉండగా.. రబాడ బౌలింగ్‌కు దిగాడు. 19 ఓవర్‌ రెండో బంతికి సమద్‌ సిక్సర్‌ బాదగా, మూడో బంతికి రబాడ అతడిని అవుట్‌ చేశాడు.నాలుగో బంతికి రషీద్‌ను పెవిలియన్‌కు చేర్చిన రబాడ..ఐదో బంతిని వైడ్‌గా వేసి తదుపరి బంతికి గోస్వామిని అవుట్‌ చేశాడు.  ఆఖరి ఓవర్లో 4రన్సే చేసిన సన్‌రైజర్స్‌ విజయానికి 17 పరుగుల దూరంలో ఆగిపోయింది.

స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌:
స్టొయినిస్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 38; ధావన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) సందీప్‌ 78; అయ్యర్‌ (సి) మనీశ్‌ పాండే (బి) హోల్డర్‌ 21; హెట్‌మైర్‌ (నాటౌట్‌) 42;  పంత్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 189. 
వికెట్ల పతనం: 1–86, 2–126, 3–178.
బౌలింగ్‌: సందీప్‌  4–0–30–1, హోల్డర్‌ 4–0–50–1, నదీమ్‌ 4–0–48–0, రషీద్‌ ఖాన్‌ 4–0–26–1, నటరాజన్‌ 4–0–32–0.  

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియమ్‌ గార్గ్‌ (బి) స్టొయినిస్‌ 17; వార్నర్‌ (బి) రబడ 2; మనీశ్‌ పాండే (సి) నోర్జే (బి) స్టొయినిస్‌ 21; విలియమ్సన్‌ (సి) రబడ (బి) స్టొయినిస్‌ 67; హోల్డర్‌ (సి) ప్రవీణ్‌ దూబే (బి) అక్షర్‌ 11; సమద్‌ (సి) (సబ్‌) కీమో పాల్‌ (బి) రబడ 33; రషీద్‌ ఖాన్‌ (సి) అక్షర్‌ (బి) రబడ 11;గోస్వామి (సి) స్టొయినిస్‌ (బి) రబడ 0; నదీమ్‌ (నాటౌట్‌) 2; సందీప్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172.
వికెట్ల పతనం: 1–12, 2–43, 3–44, 4–90, 5–147, 6–167, 7–167, 8–168. 
బౌలింగ్‌: అశ్విన్‌ 3–0–33–0, రబడ 4–0–29–4, నోర్జే 4–0–36–0, స్టొయినిస్‌ 3–0–26–3, అక్షర్‌ 4–0–33–1, ప్రవీణ్‌ దూబే 2–0–14–0.