అజిత్ పవార్ ట్వీట్ కలకలం, భగ్గుమన్న శరద్ పవార్

Politics Published On : Monday, December 2, 2019 04:00 PM

మహారాష్ట్ర రాజకీయాలు  రోజు రోజుకు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఎన్సీపీ బహిష్కృత నేత, మహారాష్ట్ర ఉపమఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్‌ పవార్‌ (Ajit Pawar) చేసిన ట్వీట్ మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఎప్పటికీ తాను ఎన్సీపీ నేతనే అని అజిత్ పవార్ ట్వీట్ చేశారు. ‘‘నేను ఎన్సీపీలోనే ఉన్నాను. ఎప్పటికీ పార్టీలోనే ఉంటాను. బాబాయి శరద్ పవారే మా నేత’’ అని అజిత్ పవార్ ట్వీట్ చేశారు. అంతా బాగానే ఉంది, బాధపడాల్సిన అవసరం లేదు. కొంత ఓపిక అవసరం అని మరో ట్వీట్ చేసిన ఆయన.. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఈ ట్వీటుపై శరద్ పవార్( Sharad Pawar) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రకటనలతో గందరగోళం సృష్టిస్తున్నాడని అన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే అజిత్‌ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని, శివసేన, కాంగ్రెస్‌తో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని(NCP unanimously decided to ally with Sena, Congress) ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

అనూహ్య మలుపుల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్‌(Devendra Fadnavis), ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌ శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 105 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి విశ్వాస పరీక్షలో నెగ్లాలంటే మరో 40 మంది సభ్యుల మద్దతు కావాలి. కాగా ఎన్సీపీ ఎమ్మెల్యేల సంఖ్య 54.వీరిలో ఎంతమంది అజిత్ పవార్ వైపు వెళతారనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. 

ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ట్విస్ట్‌కు కారణమైన అజిత్ పవార్‌ను బుజ్జగించేందుకు ఎన్సీపీ శాసనసభాపక్ష నేత జయంత్‌ పాటిల్‌ చేసిన ప్రయత్నం విఫలమైనట్లు తెలుస్తోంది. ఆయనతో చర్చలు జరిపేందుకు అజిత్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాను బీజేపీతోనే ఉన్నట్లు అజిత్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. మహారాష్ట్ర ప్రజలకు సుస్థిరమైన పాలన అందించేందుకు కృషిచేస్తానంటూ మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ట్విచ్‌ చేశారు. 

బీజేపీ బలపరీక్షలో నెగ్గేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ, కాంగ్రెస్‌, శివసేన పార్టీలు తమ ఎమ్మెల్యేలను బీజేపీ వలకు చిక్కకుండా హోటళ్లకు తరలించాయి. వారు ఉన్న హోటళ్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. శివసేన ఎమ్మెల్యేలు ఉన్న లలిత్‌ హోటల్‌ వద్ద రెండు పోసీస్‌ స్టేషన్ల సిబ్బంది కాపలా ఉన్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు. కాంగ్రెస్‌, ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉన్న హోటళ్లలో కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. వచ్చిపోయే ప్రతి వాహనాన్ని తనిఖీలు  చేస్తున్నారు. 

మరోవైపు రెనోసా హోటల్‌లో ఉన్న ఎన్సీపీ ఎమ్మెల్యేలతో శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితిని వారికి వివరించినట్టు తెలుస్తోంది. 49 మంది ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని ఎన్సీపీ నేతలు చెప్తున్నారు. ఢిల్లీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు తిరిగొస్తారని పేర్కొన్నారు. మొత్తం 54 మంది ఎమ్మెల్యేలున్న ఎన్సీపీలో 50 మంది సభ్యులు శరద్‌ వెంటే ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేవలం నలుగురు మాత్రమే అజిత్‌ వెంట ఉన్నారని వారు కూడా వెనక్కి రాకపోతే అనర్హత వేటు తప్పదని శరద్‌ ఇదివరకే ప్రకటించారు.