హైదరాబాద్‌లో మహిళా జర్నలిస్టుకు వేధింపులు, కేటీఆర్ సీరియస్..!

Politics Published On : Friday, March 27, 2020 02:00 PM

కరోనా వైరస్ దెబ్బకు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తీవ్ర వివక్షతకు గురవుతున్నారు. విద్యా, ఉద్యోగాల కోసమో, జీవనోపాధి కోసమో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నివసించే ఈశాన్య రాష్ట్రాల ప్రజల పట్ల స్థానికులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు కించపరుస్తున్నారు. దూషణలకు దిగుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి కారణం ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజలు ముఖం చైనీయులను పోలి ఉండటమే.

వివరాలలోకి వెళితే, అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ యువతి చాలాకాలం నుంచి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఓ ప్రముఖ ఇంగ్ల దినపత్రికలో ఆమె కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తుంది.అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన వారి ముఖాలు దాదాపుగా చైనీయులను పోలి ఉంటాయి. చైనీయులను పోలిన ముఖం ఉండటం వల్ల హైదరాబాద్‌లో కొందరు స్థానికులు ఆమెను అవహేళనకు గురి చేశారు. కరోనా వైరస్ వచ్చింది అంటూ ఆమెను ఆటపట్టించారు.

మెడికల్ షాప్‌కు వెళ్లిన తనను సుమారు 15 మంది హైదరాబాదీ యువకులు కరోనా వైరస్ అంటూ వెక్కిరించారని, అవహేళనకు గురి చేశారని ఆ మహిళా జర్నలిస్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్‌లో పొందుపరిచారు. దాన్ని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. ఈ ఘటన పట్ల కేటీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను సహించబోమని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు.