జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి అవసరం లేదు - బాలయ్య అల్లుడు భరత్..!
జూనియర్ ఎన్టిఆర్ పైన బాలకృష్ణ రెండవ అల్లుడు శ్రీ భరత్ చేసిన వ్యాఖ్యలు టిడిపి లో హాట్ టాపిక్‌గా మారాయి. వైజాగ్ పార్లమెంటు నుంచి పోటీ చేసిన భరత్, ఎంవివి సత్యనారాయణ చేతిలో ఓడిపోయారు. భరత్ తన ఓటమిని అధిగమించి ప్రజల్లోకి రావాలని చేస్తున్న ప్రయత్నంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపాయి. వివరాలలోకి వెళితే జూనియర్ ఎన్టీఆర్ టిడిపిలోకి తిరిగి వస్తే టీడీపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి బయటపడుతుంది అని చాలా మంది అనుకుంటున్నారు. ఇదే విషయాన్నీ సినీ దర్శకుడు వర్మ వంటి వాళ్ళు బాహాటంగా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరమని చెప్పారు. మునిగిపోతున్న టీడీపీని రక్షించగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది తారక్ ఒక్కరేనని వర్మ అభిప్రాయపడ్డారు. ఇక ఈ నేపధ్యంలో పెద్ద ఎత్తున టీడీపీ అభిమానులు హర్షం వ్యక్తం చేసారు.
ఇక ఇదే సమయంలో ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు, టిడిపిలో జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉందా లేదా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదని చెప్పిన శ్రీ భరత్, ఒకవేళ టీడీపీ కి ఎన్టీఆర్ అవసరం అనుకుంటే ఆయనకు పార్టీలోకి వచ్చే ఉద్దేశం ఉంటే అధినేతతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు. జూనియర్ వస్తేనే పార్టీకి మంచిది అంటే తాను ఒప్పుకోనన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే పార్టీని రక్షించగలరని తాను అంగీకరించనని భరత్ అభిప్రాయపడ్డాడు . పలానా వ్యక్తి వస్తేనే పార్టీకి బలం అనడం సరికాదని పేర్కొన్నారు శ్రీ భరత్. భరత్ వ్యాఖ్యలతో టిడిపి అభిమానులు, నాయకులు ఖంగు తిన్నారు . జూనియర్ ఎన్టీఆర్ కు గట్టిగా మద్దతు ఇస్తున్న టిడిపిలోని ఒక విభాగం ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది.