టీడీపీ మాజీ మంత్రులపై కేసు నమోదు..! అరెస్ట్..!

Politics Published On : Wednesday, February 5, 2020 09:54 AM

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. మభ్యపెట్టి తన భూమి కొనుగోలు చేశారని వెంకటాయపాలెంకు చెందిన దళిత మహిళ పోతురాజు బుజ్జి ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. టీడీపీ మాజీ మంత్రులు పి.నారాయణ, పత్తిపాటి పుల్లారావు లతో పాటు టీడీపీ నాయకుడు బెల్లంకొండ నరసింహారావుపై సెక్షన్‌ 420, 506 రెడ్‌విత్‌ 120(బి)తోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సెక్షన్‌ 3(1)(జి)(పి) కేసు నమోదు చేసిన సీఐడీ.. పలు ప్రాథమిక ఆధారాలు సేకరించింది.

అమరావతి ,పెద్దకాకాని, తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి గ్రామాల్లో తెల్లకార్డు దారులను బినామీలుగా అడ్డుపెట్టుకుని 720 ఎకరాలను కొనుగోలు చేసినట్టు నిర్ధారించింది. ఈ కేసును సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి దర్యాప్తు చేస్తున్నారు.

ఆధారాలతో సహా ఈడీకీ లేఖ రాసిన సీఐడీ

రాజధాని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో మనీ ల్యాండరింగ్‌ జరిగిందని, దీనిపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చెన్నై రీజినల్‌ కార్యాలయానికి సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్‌ గత నెలలో లేఖ రాశారు. ఈ మేరకు ఎన్‌పోర్సుమెంట్‌ సదరన్‌ రీజియన్‌ స్పెషల్‌ డైరెక్టర్‌కు రాజధాని ప్రాంతంలో తెల్లకార్డుదారుల పేరుతో కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన డాక్యుమెంట్లతోపాటు, తెల్లరేషన్‌ కార్డు హోల్డర్ల వివరాలను పంపించారు.