అమరావతిలో మనీల్యాండరింగ్ బాగోతం. ఇన్‌సైడర్‌పై ఈడీ కొరడా..!
రాజధాని అమరావతిలో జరిగిన భూ కుంభకోణంపై దర్యాప్తునకు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధమైంది. రాజధాని పేరుతో సాగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఈడీ సోమవారం ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కేసు నమోదు చేసింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు, మరికొందరు టీడీపీ నేతలపై సీఐడీ ఇచ్చిన ఆధారాల నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు హయాంలో రాజధాని ఏర్పాటుపై పథకం ప్రకారం ముందే లీకులు ఇచ్చి అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి లబ్ధి పొందేలా దోహదపడ్డారనే అభియోగాలున్నాయి. దీనిపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనే విషయాన్ని నిర్ధారించింది.
2014 జూన్ నుంచి డిసెంబర్ లోపు ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా సీఆర్‌డీఏ పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,069.94 ఎకరాల భూ కుంభకోణం జరిగినట్టు మంత్రివర్గ ఉపసంఘం నిగ్గు తేల్చింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఎన్‌ఆర్‌ఐ వేమూరి రవికుమార్ ప్రసాద్, పరిటాల సునీత, జీవీ ఆంజనేయులు, లింగమనేని రమేష్, పయ్యావుల కేశవ్, దూళిపాళ నరేంద్ర, లంకా దినకర్, కంభంపాటి రామ్మోహన్‌రావు, పుట్టా మహేష్ యాదవ్, తదితర టీడీపీ నేతలు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్టు మంత్రివర్గ ఉప సంఘం స్పష్టం చేసిన సంగతి తెలిందే. అంతటితో ఆగకుండా టీడీపీ నేతల బంధుమిత్రులకు చెందిన భూములు ఉన్న ప్రాంతాన్ని సీఆర్‌డీఏ పరిధిలోకి తేవడం, అవసరమైన చోట వారి భూములకు మినహాయింపు ఇవ్వడం, రాజధాని ప్రాంతంలో నిర్మాణాల విషయమై పథకం ప్రకారం వారికి ఉప్పందించి లాభపడేలా చేయడంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు మంత్రివర్గ ఉప సంఘం నిర్ధారించింది.
తెల్లకార్డుదారులు 761.34 ఎకరాల భూమి కొనుగోలు
మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా తీగలాగిన రాష్ట్ర నేర పరిశోధన శాఖ (సీఐడీ) గత ప్రభుత్వ పాలనలో జరిగిన భూ కుంభకోణాలను నిగ్గు తేల్చింది. అమరావతిలో నాలుగు వేల ఎకరాల భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించింది. అమరావతి రాజధాని కోర్ ఏరియాలో 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు 761.34 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు సీఐడీ అధికారులు ఆధారాలు సేకరించారు. పేద వర్గాలుగా తెల్లకార్డులు పొందిన వారు దాదాపు రూ.276 కోట్లు పెట్టి ఆ భూములు ఎలా కొన్నారనే దానిపై సీఐడీ కూపీ లాగింది. పచ్చ నేతలకు బినామీలుగా తెల్లకార్డుదారుల పేర భూములు కొన్నట్టు నిర్ధారణ కావడంతో ఇందులో మనీ ల్యాండరింగ్, అక్రమ ఆదాయం వంటి అంశాలు ముడిపడ్డాయి.
2015 అక్టోబర్‌లో వెంకటపాలెంకు చెందిన పి.బుజ్జి భూమిని అప్పటి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ దన్నుతో వారి బినామీలు మోసం చేసి, బెదిరించి, బలవంతంగా తక్కువ ధరకు కొనుగోలు చేసినట్టు ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఆ లేఖలో సునీల్‌కుమార్ పేర్కొన్నారు.
రాజధాని భూముల కొనుగోల్‌మాల్‌లో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరడంతో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేపట్టనుంది.
ఐటీ ‘తెల్ల’బోయేలా..
తెల్లకార్డు కలిగిన పేద వర్గాలు కోట్లు పెట్టి రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వ్యవహారంలో సీఐడీ అందించిన వివరాలను పరిశీలిస్తే ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు సైతం తెల్లబోయేలా చేసింది.
ఇన్‌కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ (ఆంధ్రప్రదేశ్ – విజయవాడ)కు గత నెల 22న సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ ఆధారాలతో సహా లేఖ రాశారు. 2014 – 2015లో పేద వర్గాల వారు భారీ మొత్తాలను పెట్టుబడి పెట్టి రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని, తెల్లకార్డు కలిగిన వారికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది దర్యాప్తు చేస్తే వారి వెనుక టీడీపీ నేతల పెట్టుబడి బయటకు వస్తుందని సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్ రాసిన లేఖలో పేర్కొన్నారు.
వీరిలో కొంత మంది పాన్‌కార్డు సమర్పించారని, అత్యధిక శాతం వారికి పాన్‌కార్డులు లేవని, వారి పేర్లు, తెల్లకార్డు నంబర్లు, కొనుగోలు చేసిన భూముల దస