CBSE Board Exams 2021: సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలు వాయిదా

Offbeat Published On : Friday, February 12, 2021 04:30 PM

New Delhi, December 22: ప్రస్తుత విద్యాసంవత్సరం సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలు 2021 (CBSE Board Exams 2021) జనవరిలో గానీ, ఫిబ్రవరిలో గానీ జరుపలేమంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ కీలక ప్రకటన చేశారు. పరీక్షలు రద్దు చేయబడవని, కానీ వాయిదా వేస్తారని చెప్పారు. ఆన్‌లైన్ పరీక్షలు సాధ్యం కానందున పరీక్షలు ఆఫ్‌లైన్‌లో జరుగుతాయని కేంద్ర మంత్రి అన్నారు.

దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ పాఠశాలల ఉపాధ్యాయులతో సంప్రదించిన తర్వాత మంత్రి (Education Minister Ramesh Pokhriyal) మంగళవారం మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలను నిర్వహించడానికి అనువైన వాతావరణం లేదన్నారు. సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షల నిర్వహణ తేదీలను (CBSE Board Exams 2021 Dates Update) తర్వాత నిర్ణయిస్తామని తెలిపారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలను రద్దు చేసి పై తరగతికి విద్యార్థులను ప్రమోట్‌ చేయడం వల్ల వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని రమేశ్‌ పోఖ్రియాల్‌ చెప్పారు. ఉన్నతవిద్యాకోర్సుల్లో అడ్మిషన్లకు, ఉద్యోగావకాశాలకు ప్రతిబంధకంగా మారుతుందని తెలిపారు. కరోనా తరం విద్యార్థులదే భవిష్యత్‌ అని పేర్కొన్నారు. కనుక వారి భవితవ్యానికి ఇబ్బందులు ఏర్పడేవిధంగా చర్యలు తీసుకోబోమని రమేశ్‌ పోఖ్రియాల్‌ చెప్పారు. 

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల విద్యార్థులకు ఆఫ్‌లైన్‌లోనే పరీక్షలు జరుపుతామని రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ వెల్లడించారు. ప్రతి విద్యార్థికి లాప్‌టాప్‌తోపాటు నిరంతర విద్యుత్‌ సరఫరా కావడంతోపాటు అంతరాయం లేకుండా ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ఇంతకుముందు సీబీఎస్‌ఈ కూడా 10, 12వ తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో కాక రాతపూర్వక పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది.