ఏటీఎంలకు రగ్గులు కప్పుతూ హీటర్లు పెడుతున్నారు.
చలి మనుషులకి మాత్రమే కాదు అని హిమాచల్‌ప్రదేశ్‌లోని బ్యాంకు అధికారులు అంటున్నారు. వాటిని వెచ్చగా ఉంచేందుకు రగ్గులు కప్పుతున్నారు. అక్కడితో ఆగడం లేదు. మరింత వెచ్చగా ఉంచేందుకు హీటర్లు కూడా పెడుతున్నారు. విచితంగ్రా ఉన్నా ఇది వాస్తవం. హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహుల్-స్పిటి జిల్లాలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. మైనస్ డిగ్రీలకు చేరుకోవడంతో ఏటీఎంలు జామ్ అయిపోతున్నాయి. దీంతో డబ్బులు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిష్కార మార్గం ఆలోచించిన బ్యాంకు అధికారులు ఏటీఎం కేంద్రాల్లో హీటర్లు పెట్టడంతోపాటు రగ్గులు కూడా కప్పుతున్నారు. జిల్లాలోని కేలాంగ్ ప్రాంతంలోని ఏటీఎంలు ఇప్పుడు రగ్గులతో దర్శనమిస్తున్నాయి.
లాహుల్-స్పిటిలో ఉష్ణోగ్రతలు మైనస్ 25 డిగ్రీల సెల్సియస్ డిగ్రీలకు పడిపోయాయి. దీంతో ఏటీఎంలు పనిచేయడం మానేశాయి. అంతేకాదు.. యంత్రాలు పాడైపోతుండడంతో స్పందించిన అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. గదిని వెచ్చగా ఉంచేందుకు హీటర్లు పెడుతున్నామని అధికారులు తెలిపారు. ప్రజలు కూడా చలికి గడ్డకట్టుకు పోతున్నారు. నల్లానీళ్లు కూడా గడ్డకట్టుకుపోతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వాహనాల మొరాయింపునకు అంతేలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.