ఇండియాలో ఉంటూ పాక్‌కు సమాచారం చేరవేస్తున్న లేడీ యూట్యూబర్
భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణల సమయంలో పాకిస్తాన్ సైన్యానికి, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కి సమాచారం అందించారనే ఆరోపణలతో హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆమె ట్రావెలింగ్ విసాపై పాకిస్థాన్లో పర్యటించినట్లు తెలుస్తోంది. భారత సైనిక స్థావర సమాచారాన్ని పాకిస్థాన్ కు చేరవేసిందని తెలుస్తోంది. ఆమెతో పాటు హర్యానాలోని కైతాల్‌లోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. నిందితుడిని మస్త్‌గఢ్ చీకా గ్రామానికి చెందిన 25 ఏళ్ల దేవేంద్ర ధిల్లాన్‌గా గుర్తించారు. “కైతాల్ జిల్లా పోలీసులకు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది, దాని ఆధారంగా మా ప్రత్యేక డిటెక్టివ్ సిబ్బంది మస్త్‌గఢ్ చీకా గ్రామ నివాసి నర్వాల్ సింగ్ కుమారుడు దేవేంద్రను అరెస్టు చేశారు” అని డీఎస్‌పీ వీర్భన్ అన్నారు.
దేవేంద్రను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు అతడిని ప్రశ్నించారు. విచారణ సమయంలో తాను పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంప్రదింపులు జరిపినట్లు దేవేంద్ర పోలీసులకు వెల్లడించాడు. దేవేంద్ర పాటియాలాలోని ఖల్సా కళాశాలలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతను కొంతకాలం క్రితం పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఏర్పరచుకుని ఇండియాపై గూఢచర్యం ప్రారంభించాడని సమాచారం. అతని కుటుంబం మస్త్‌గఢ్ గ్రామంలో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తోంది. అతని ఇంట్లో అతని తల్లిదండ్రులు, అమ్మమ్మ, సోదరి ఉంటారు. విచారణలో భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న వివాదం గురించి ఆ ఏజెన్సీకి, ‘ఆపరేషన్ సిందూర్’ గురించి పాకిస్తాన్ సైన్యానికి, ISIకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేవాడినని అతను ఒప్పుకున్నాడు. సైబర్ పోలీసులు అతని వద్ద దొరికిన పరికరాలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. దేవేంద్ర కొంతకాలంగా ఫేస్‌బుక్‌లో ఆయుధాలతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తున్నాడు. మొదట్లో తుపాకీలపై అతనికి ఉన్న ఆసక్తికి సంబంధించి అతన్ని అరెస్టు చేశారు. అయితే విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అతను భారత ఆర్మీ స్థావరాల ఫోటోలు, వీడియోలను పాకిస్తాన్‌కు పంపుతున్నట్లు సమాచారం. దేవేంద్ర ఇటీవల కొంతమంది బంధువులతో కలిసి కర్తార్‌పూర్ సాహిబ్‌లో దర్శనం (తీర్థయాత్ర) కోసం పాకిస్తాన్‌ను సందర్శించాడు. ఈ పర్యటన సమయంలోనే అతనికి ISI కార్యకర్తలతో పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది. దేవేంద్రపై రాజద్రోహం, జాతీయ భద్రతా చట్టం (NSA) కింద కేసు నమోదు చేశారు పోలీసులు.