దెబ్బకు దెబ్బ తీసిన భరత్..!
కొన్నిరోజులుగా జరుగుతున్న ఉగ్రవాదులపై పోరులో భద్రతా దళాలు భారీ విజయం సాధించాయి. గత ఎనిమిదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ రియాజ్ నైకూ ను మట్టుబెట్టాయి. అతడితోపాటు మరో ముగ్గురు ఉగ్రవాదులను కూడా సైనికులు హతమార్చారు. భద్రతా దళాలకు చెందిన ఎనిమిది మంది సిబ్బందిని హంద్వారాలో కాల్చి చంపిన ఉగ్రవాదులను మూడు రోజుల్లోనే మన జవాన్లు హతమార్చి ప్రతీకారం తీర్చుకోవడం విశేషం. వివరాలలోకి వెళితే దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపోరాలోని బీఘ్పోరా, షార్షల్లి గ్రామాల్లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య బుధవారం భీకర కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో బీఘ్పోరాలో రియాజ్ నైకూతో పాటు అతని అనుచరుడు, షార్షల్లిలో మరో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఇతని తలపై రూ.12 లక్షల రివార్డు ఉంది. మంగళవారం రాత్రి బీఘ్పోరాలో నైకూ దాక్కున్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు నైకూ పారిపోకుండా భద్రతా దళాలు అతడి స్థావరాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాయి. దీంతో బలగాలపై నైకూ, అతని అనుచరుడు కాల్పులు జరపడంతో బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. 12 గంటల పాటు ఈ కాల్పులు కొనసాగాయి. ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా బలగాలు రక్షణ కవచంగా నిలిచాయి. మధ్యాహ్నం ఓ ఉగ్రవాది బయటకు వచ్చి బలగాలపై కాల్పులు జరిపాడు. దీంతో బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో అతను హతమయ్యాడు. అనంతరం ఆ స్థావరానికి వెళ్లి చూడగా నైకూ, అతని అనుచరుడి శవాలు కనిపించాయని అధికారులు తెలిపారు. సొంత ఊరైన బీఘ్పోరాలోనే నైకూ హతమవడం విశేషం. నైకూ మృతితో శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చని భావించిన అధికారులు లోయవ్యాప్తంగా ప్రైవేట్ ఆపరేటర్ల మొబైల్, టెలిఫోన్ సేవలను నిలిపివేశారు. రియాజ్ నైకూను మట్టుబెట్టిన భద్రతా బలగాలపై కాంగ్రెస్ పార్టీ ప్రశంసల జల్లు కురిపించింది.