కరోనా విజృంభిస్తే భారత్ తట్టుకోగలదా.. 'మే'లో గండం పొంచి ఉందట, సైంటిస్టుల వార్నింగ్

News Published On : Wednesday, March 25, 2020 11:03 AM

కరోనా వైరస్ నియంత్రణకు భారత్ చేస్తున్న కృషిని డబ్ల్యూహెచ్ఓ అభినందించిన సంగతి తెలిసిందే. అయితే సైంటిస్టులు మాత్రం భారత్‌ను హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న లెక్కల ఆధారంగా చర్యలు తీసుకుంటే.. వైరస్ వ్యాప్తిని తక్కువ అంచనా వేసినట్టవుతుందంటున్నారు. ఇందుకు అమెరికా,ఇటలీ ఉదంతాలే కళ్ల ముందు కనిపిస్తున్న ఉదాహరణలు అని చెబుతున్నారు. ఇండియా జనాభా,ఇక్కడున్న వైద్య వసతుల రీత్యా భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరించడం అవసరం అంటున్నారు.

కోవిడ్-19పై అధ్యయనం చేస్తున్న ఓ ఇంటర్ డిసిప్లినరీ గ్రూపుకు చెందిన స్కాలర్స్‌,డేటా సైంటిస్టులు భారత్‌లో కరోనా విస్తరణపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. భారత్‌లో కరోనా స్క్రీనింగ్ టెస్టుల సంఖ్య అతి తక్కువగా ఉందని.. మార్చి 18 నాటికి కేవలం 11,500 మందిని మాత్రమే స్క్రీనింగ్ చేశారని తెలిపారు. కరోనా వైరస్‌కు ఇప్పటివరకు వ్యాక్సిన్ కనుగొనని నేపథ్యంలో.. వైరస్ ఒకవేళ మూడో దశలోకి ప్రవేశిస్తే వినాశనకర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. భారత్‌లో ఉన్న హెల్త్ కేర్ వ్యవస్థపై అది తీవ్ర దుష్ప్రభావం చూపుతుందన్నారు. అమెరికా,ఇటలీ లాంటి దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ.. ఒక్కసారిగా విస్ఫోటనం చెందిందని అన్నారు. ఇప్పటికైతే ఇతర దేశాలతో పోలిస్తే వైరస్‌ను భారత్ నియంత్రిస్తున్నట్టే కనిపిస్తున్నా.. మే నెలలో సగం రోజులు గడిచే నాటికి 13లక్షలకేసులు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొనడం గమనార్హం.భారత్‌లో తక్కువ స్క్రీనింగ్ టెస్టులు జరుగుతున్న మూలంగా.. మొదటి దశలో వచ్చిన డేటాను ఆధారంగా చేసుకుని వైరస్ వ్యాప్తిని తక్కువ అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు. మార్చి 19 వరకు భారతదేశంలో COVID-19 కేసుల వృద్ధి రేటు సుమారు 13 రోజుల లాగ్‌తో అమెరికా నమూనానే తలపిస్తోందన్నారు. అమెరికాలోనూ ప్రారంభ దశలో అక్కడి కేసుల సంఖ్య ఇటలీ మొదటి 11 రోజుల దశకు దగ్గరగా ఉందన్నారు