శ్రీనివాసరావు ఇంటికి అదానీ..ఇంతకీ ఆయన ఎవరంటే..
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ, ఆయన కుమారుడు కరణ్ అదానీ ఆదివారం హైదరాబాద్ నగరానికి వచ్చారు. ప్రతిమ గ్రూప్ ఛైర్మన్ బోయినపల్లి శ్రీనివాసరావు నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి శ్రీనివాసరావు కుమార్తెలు డాక్టర్లు హరిణి, హాసినీ స్వాగతం పలికారు. గౌతమ్, కరణ్‌లు తేనీటి విందును స్వీకరించారు.
ప్రతిమ గ్రూప్స్ అధినేత బోయినపల్లి శ్రీనివాస్ రావు 2022 డిసెంబరు నెలలో సొంత హెలికాప్టర్ కొన్నారు. దీనికి యాదగిరిగుట్టలోని హెలిప్యాడ్ వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. ఈ పూజలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ సోదరుడే బోయినపల్లి శ్రీనివాసరావు. శ్రీనివాసరావు పారిశ్రామికవేత్తగా అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులతోనూ సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారు.ఆయన దాదాపు 20 కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రతిమ గ్రూప్ అనే వ్యాపార సంస్థను ఆయన నిర్వహిస్తున్నారు. వైద్యరంగం, ఇంధన రంగం, మౌలిక సదుపాయాలు, తయారీ, టెలికాం, వినోదం, ఆతిథ్యం వంటి విభిన్న రంగాల్లో ప్రతిమ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇంధన రంగంలో ఎల్గెన్ ప్రాజెక్ట్, మౌలిక సదుపాయాల రంగంలో ప్రతిమ ఇన్‌ఫ్రా పేరుతో కంపెనీలను బోయినపల్లి శ్రీనివాసరావు నడుపుతున్నారు. బహుశా ఈ కంపెనీలు అదానీ గ్రూపుతో కలిసి పనిచేస్తుండొచ్చనే అంచనాలు ఉన్నాయి. సామాజిక సేవ కోసం ప్రతిమ ఫౌండేషన్‌ను బోయినపల్లి శ్రీనివాసరావు నిర్వహిస్తున్నారు. ప్రతిమ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఒక భాగంగా ప్రతిమ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. ప్రతిమ ఎడ్యుకేషనల్ సొసైటీని 2001లో ఏర్పాటు చేశారు. ఇది తొలుత కరీంనగర్‌లో ప్రతిమ ఆస్పత్రి (PIMS)ని ఏర్పాటు చేసింది. అత్యాధునిక వైద్య మౌలిక సదుపాయాలతో వరంగల్ నగరం శివార్లలో నిర్మించిన ప్రతిమ ఆస్పత్రి వీరిదే. దీన్ని స్వయంగా ఆనాటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు.