మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎప్పటి నుండి అంటే..
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. శనివారం కర్నూలు నగరంలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ రాయలసీమను రతనాలసీమగా మారుస్తామని, హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రైతు బజార్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. డ్వాక్రా మహిళలకు చెత్త నుండి సంపద బాధ్యతలు అప్పగిస్తామని, మహిళకు ఆదాయం అందిస్తామని చెప్పారు. సత్యసాయి జిల్లా లేపాక్షి నుండి ఓర్వకల్లు వరకు పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేసి ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్, డిఫెన్స్, ఏరోస్పేస్ పరిశ్రమలు తీసుకువస్తామని తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లనూ అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచం మెచ్చుకునేలా విశాఖలో యోగా డే నిర్వహిస్తామన్నారు. గత ప్రభుత్వం పట్టణాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వదిలిపెట్టిందని, అక్టోబర్ 2 నాటికి చెత్త లేకుండా చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ సంవత్సరం లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేస్తామన్నారు. తడి చెత్తను కంపోస్టుగా మార్చాలని, డ్వాక్రా మహిళల ద్వారా అది ఉద్యమంగా మారుతుందని, ప్రపంచానికే ఆదర్శం అవుతుందని చెప్పారు. పొడి చెత్తను రీ సైక్లింగ్ కు పంపిస్తామని, అనేక వస్తువులు తయారవుతాయని తెలిపారు. 15,995 గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ ఇస్తామని, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తామని తెలిపారు. రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారవుతుందని, రాయలసీమ కేంద్రంగా పని చేస్తుందని చెప్పారు. పోలవరం నుండి బానకచర్ల కు నీళ్లు తెస్తే రాయలసీమ గేమ్ చేంజర్ గా తయారవుతుందని, ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే పరిస్థితి వస్తుందని తెలిపారు. సంక్షేమం, ఉపాధి, అభివృద్ధి శాశ్వతంగా గుర్తు పెట్టుకునేలా చేస్తామన్నారు. పేదలకు చేయూతనిస్తే బంగారు కుటుంబాలు అవుతాయని, వారికి మార్గదర్శిగా ఉండేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. 2029 నాటికి పేదరికం లేకుండా చేస్తామన్నారు.