కరోనా పేషెంట్, అతని తండ్రితోపాటు పలువురిపై కేసు నమోదు, రీజన్ తెలుసా

News Published On : Tuesday, May 12, 2020 12:00 PM

ఏపీలో కరోనా బాధితుడిపైన తొలి కేసు నమోదు అయ్యింది . తెనాలిలో కరోనా వైరస్ వ్యాప్తికి కారణమయ్యారన్న ఆరోపణలతో కరోనా పేషంట్ తో పాటు అతని తండ్రిపైన వీరికి సహకరించిన లారీ ఓనర్, డ్రైవర్ లపైన కేసు నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకే వారి మీద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. కరోనా వ్యాప్తిని అరికట్టటానికి విధించిన లాక్ డౌన్ తో జనజీవనం స్తంభించింది . ఎక్కడి వారు అక్కడే ఆగిపోయి ఇంటికే పరిమితమై ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో చాలా మంది వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న తమ వారిని తీసుకు రావటం కోసం అక్రమ మార్గాలను ఎంచుకుని లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కారు .

తెనాలిలోని ఐతా నగర్ కు చెందిన ఓ యువకుడు చెన్నైలోని ఓ హోటల్ లో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఈ నెల 1వ తేదీన చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్ కు తెనాలి నుంచి ఓ లారీ వెళ్లగా, లారీ డ్రైవర్ ఫోన్ నంబర్ ను తన కుమారుడికి ఇచ్చిన అతని తండ్రి ఆ లారీలో కుమారుణ్ణి తెనాలికి రప్పించాడు. అయితే అతనికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో అతను ఎక్కడి నుండి వచ్చాడు , ఎలా వచ్చాడు తెలుసుకున్న అధికారులు వారిని కూడా క్వారంటైన్ కు తరలించారు . ఇక అతడిని ఐసొలేషన్ కు తరలించారు. జరిగిన విషయాన్ని స్థానిక ఏఎన్ఎం పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా లాక్ డౌన్ నిబంధనలు ఉలంగించి కరోనా వ్యాప్తికి కారణమయ్యారని వారిపై కేసు నమోదు చేసారు.