అమిత్‌ షాకు చంద్రబాబు ధన్యవాదాలు, చంద్రబాబు ట్వీట్‌పై విరుచుకుపడుతున్న నెటిజన్లు

News Published On : Wednesday, December 4, 2019 03:00 PM

నవ్యాంధ్రప్రదేశ్‌కు అమరావతిని రాజధానిగా చూపిస్తూ దేశ పటాన్ని సరిదిద్ది విడుదల చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Home Minister Amit Shah)కు ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన అమిత్‌ షాకు శనివారం ఒక లేఖ రాశారు. ప్రజా రాజధాని అమరావతి(Amaravati) ప్రస్తావన లేకుండా సర్వే ఆఫ్‌ ఇండియా ఈ నెల రెండో తేదీన విడుదల చేసిన దేశపటం ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh )ప్రజలను నిరుత్సాహానికి, ఆశ్చర్యానికి గురి చేసిందని ఈ లేఖలో ఆయన చెప్పారు. 2015 అక్టోబరు 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని ఆయన తన లేఖలో గుర్తు చేశారు. ఈ అంశాన్ని టీడీపీ ఎంపీలు లోక్‌సభలో లేవనెత్తిన వెంటనే హోంశాఖ స్పందించి అతి త్వరగా దేశపటాన్ని సవరించి మళ్లీ విడుదల చేసిందని, ఇంత త్వరగా దీనిపై చర్య తీసుకొన్నందుకు తమ పార్టీ, రాష్ట్ర ప్రజల తరఫున వ్యక్తిగతంగా హోంమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు.

జమ్మూకాశ్మీర్ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత కేంద్రం మ్యాప్ లో ఆ రెండింటినీ చేరుస్తూ భౌగోళిక మ్యాప్ లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ పొలిటికల్ మ్యాప్లో ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించలేదు. దీంతో కలకలం రేగింది. అయితే తాజాగా అమరావతితో కూడిన ఇండియా మ్యాప్ను కేంద్రం విడుదల చేసింది. 2015లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన ఏపీ రాజధాని అమరావతిపై రాజకీయ కలకలం రేగిన సంగతి తెలిసిందే. 

తాజాగా భారత మ్యాప్లో రాజదానిగా అమరావతిని గుర్తించకుండా కేంద్ర హోం శాఖ మాప్ విడుదల చేయడంతో...ఇది మరో మలుపు తిరిగింది. కేంద్రం దోషిగా మారింది. అయితే స్థానిక ప్రభుత్వం తమ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ గెజిట్ జారీ చేయలేదని దీంతో కేంద్రం సైతం గుర్తించలేదని సమాధానం వచ్చింది. తాజాగా పార్లమెంటు సమావేశాల్లో ఆయా పార్టీల నేతలు గళం వినిపించడంతో అమరావతిని రాజధానిగా పేర్కొంటూ కేంద్రం తాజాగా మ్యాప్ విడుదల చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కొత్త మ్యాప్ను ట్వీట్ చేశారు.