Breaking: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కేసు నమోదు
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలోని అటవీ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి, స్థలాన్ని ఆక్రమించడంతోపాటు జీవవైవిధ్యానికి నష్టం కలిగించారని ప్రాథమిక నేర నివేదిక (పీవోఆర్)లో అధికారులు పేర్కొన్నారు. నిందితులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరమ్మ ఉన్నారు.
పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు 27.98 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశారని విచారణ బృందం తేల్చింది. ఏ అనుమతులూ లేకుండానే బోరు వేశారని, ఆక్రమణల మూలంగా జీవవైవిధ్యానికి రూ.కోటికిపైగా నష్టం కలిగిందని అధికారులు తేల్చారు. ప్రస్తుతం అటవీ ప్రాంతం వరకు హద్దు రాళ్లు నాటుతున్నారు. మరో వారంలో ఇది పూర్తవుతుంది. త్వరలో పాకాల కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ వ్యవహారంలో క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించినందున దీనిపై సమాలోచనలు జరుపుతున్నారు. సహకరించిన అధికారుల వివరాలు ఆరా తీస్తున్నారు. వారిపైనా శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.