తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు.. ఎప్పుడంటే..
తాము అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతీ విద్యార్ధి తల్లి ఖాతా లో రూ 15 వేలు చొప్పున జమ చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తల్లికి వందనం పథకం అమలుపై కసరత్తు ప్రారంభించింది. లబ్దిదారులు, ఆర్దిక భారం పైన లెక్కలు సిద్దం చేస్తోంది. తాజాగా ఈ పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో, లబ్దిదారులకు ఒక ఏడాది పథకం అమలు కానట్లే. అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలుకు సంబంధించిన నిబంధనలను ఖరారు చేసింది.
ఈ ఏడాది జూన్ లో విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలో ఈ పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. దీంతో, ఇక నుంచి ప్రతీ ఏటా అమలు చేసినా నాలుగేళ్లే ఈ పథకం అమలు కానుంది. లబ్ది దారులకు ఒక ఏడాది నిధులు కోత పడనున్నాయి. 2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాధమికంగా 69.16లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చిన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ పథకం అమలు కోసం దాదాపు రూ 10,300 కోట్లు అవసరమని అధికారులు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధన కొనసాగనుంది. 2025-26 బడ్జెట్‌లో ఈ పథకానికి నిధులు కేటాయింపులో భాగంగా ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ను సమీక్షిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపు దారులు, తెల్లరేషన్ కార్డు లేనివారిని, 300 యూనిట్ల విద్యుత్ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదు. ఇక, ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియోగం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.