విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం, 8 మంది మృతి 1500 మందికి అస్వస్థత..!
విశాఖ పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. దాదాపు 1500 మంది అస్వస్థతకు గురయ్యారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ నలుగురు మృతిచెందారు. వారిలో ఇద్దరు వృద్దులు, ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఉన్నారు. మరోవైపు విషవాయువు ప్రభావంతో వెంకటాపురంలో బావిలో పడి గంగరాజు అనే వ్యక్తి మృతిచెందగా, మేడపై నుంచి పడి మరోకరు ప్రాణాలు కోల్పోయారు. విషవాయువులు 5 కిలోమీటర్ల మేర వ్యాపించాయి.
గురువారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో పరిశ్రమ నుంచి వెలువడిన రసాయన వాయువు దాదాపు 5 కిలోమీటర్ల మేర వ్యాపించింది. కాగా లీకైన రసాయన గాలి పీల్చడంతో అక్కడి స్థానిక ప్రజలు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో పాటు చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో స్థానిక ప్రజలు నాయుడు తోట పరిసరాల్లో ఇల్లు ఖాళీ చేసి మేఘాద్రి గడ్డ డ్యామ్ వైపు పరుగులు తీశారు. కాగా రసాయన గాలి పీల్చడంతో కొంతమంది అస్వస్థతకు గురై అపస్మారకస్థితిలో రహదారిపైనే పడిపోయారు. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు లాక్డౌన్లో ఉన్న ఈ కంపెనీని తెరిపించే క్రమంలో తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా పరిశ్రమ నుంచి స్టెరైన్ అనే విష వాయువు లీకైనట్లు తెలుస్తుంది. అయితే గ్యాస్ లీకేజీ ఘటనపై అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో పాటు గ్యాస్ లీకేజీపై పోలీసులకు సమాచారమందించారు.