అందానికి, ఆరోగ్యానికి దివ్య ఔషదం.. మీ వంటింట్లోనే..

Lifestyle Published On : Thursday, March 27, 2025 07:43 AM

కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల చర్మం తన సహజమైన మెరుపును కోల్పోవడం సాధారణమైపోయింది. ముఖ్యంగా ఎండా కాలంలో సూర్యకిరణాల తాపం, దుమ్ము, ధూళి చర్మాన్ని నిర్జీవంగా చేస్తాయి. మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు మరింత కలవరపెడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులను వాడటం కంటే, మన ఇంటి కిచెన్ లో లభించే అల్లం ఒక అద్భుతమైన సహజ పరిష్కారంగా ఉపయోగపడుతుంది. అల్లంలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా దాని సహజమైన కాంతిని తిరిగి తీసుకురావడంలో సహాయపడతాయి.

అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు దెబ్బతిన్న చర్మ కణాలను పునరుద్ధరించడానికి తోడ్పడతాయి. ఇది చర్మంలో రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. దాంతో చర్మం లోపలి నుండి ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. తరచుగా మొటిమల సమస్యతో బాధపడే వారికి అల్లం ఒక అద్భుతమైన పరిష్కారం. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మంపై ఉండే హానికరమైన బ్యాక్టీరియాను మాయం చేస్తాయి. ఇది మొటిమల ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా అల్లం చర్మంపై ఉండే మచ్చలను క్రమంగా తగ్గిస్తుంది, చర్మపు రంగును సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

వయసు పెరిగే కొద్దీ ముడతలు, సన్నని గీతలు వంటి వృద్ధాప్య ఛాయలు ముఖంపై కనిపిస్తాయి. అల్లంలో ఉండే సహజ సమ్మేళనాలు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి. కొల్లాజెన్ చర్మాన్ని దృఢంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అల్లంను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం బిగుతుగా ఉంచుతుంది, ముడతలు తక్కువగా కనిపిస్తాయి. సన్‌బర్న్ సమస్యను తగ్గించడంలోనూ అల్లం సహాయపడుతుంది. 

ఎలా ఉపయోగించాలి?

ఒక టీస్పూన్ అల్లం రసంలో అర టీస్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది చర్మానికి తక్షణ కాంతినిస్తుంది. అలాగే అల్లం రసం, కలబంద గుజ్జును బాగా కలిపి ముఖానికి రాయాలి. ఇది చర్మాన్ని లోతుగా తేమ చేస్తుంది. మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. మరో వైపు ప్రతిరోజూ ఒక కప్పు అల్లం టీ తాగడం వల్ల శరీరం నుండి విష పదార్థాలు తొలగిపోతాయి, ఇది చర్మాన్ని లోపలి నుండి శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. కొద్దిగా అల్లం పొడిని తేనె , చక్కెరతో కలిపి చర్మానికి సున్నితంగా రుద్దడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోయి చర్మం తాజాగా కనిపిస్తుంది.