నేచురల్ స్టార్‌తో అదితీ రొమాన్స్

Entertainment Published On : Thursday, March 14, 2019 08:02 PM

నేచురల్ స్టార్ నానీ నుండి ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలు వస్తుంటాయి. అందులో కుటుంట కథా నేపథ్యం ఉన్న సినిమాలు మంచి వసూళ్లు రాబడతుంటాయి. దీంతో గత రెండు మూడేళ్ల నుండి నాని లిస్టులో హిట్టయిన సినిమాలు బాగానే ఉన్నాయి. గత ఏడాది వచ్చిన కృష్ణార్జున యుద్దం మరియు దేవదాస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని కాస్త ఫర్వాలేదనిపించడంతో తన తదుపరి సినిమాల మీద మరింత జాగ్రత్త తీసుకుంటున్నాడు.

ఈ ఏడాది కూడా ఇప్పటికే పలు ప్రాజెక్టులతో బిజీబిజీగా మారిపోయాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్న సూరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న "జెర్సీ" చిత్రం విడుదలకు సిద్దమైంది. ఈ సమ్మర్‌లో సందడి చేయబోతోంది. అంతే కాకుండా కె.కుమార్ డైరక్షన్‌లో "గ్యాంగ్ లీడర్" సినిమాను ఈ మధ్యనే పట్టాలెక్కించాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా ఇప్పుడు మరో సినిమాను నాని అంగీకరించాడు.

అష్టా చమ్మా సినిమాతో తనను హీరోగా పరిచయం చేసిన డైరక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో నాని సరసన అదితి రావు హైదరీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో మోహన్ కృష్ణ తెరకెక్కించిన "సమ్మోహనం" చిత్రంలో సుధీర్ బాబు సరసన అదితీ హీరోయిన్‌గా నటించింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను దోచుకున్న అదితీ ఇప్పుడు నాని సరసన నటించేందుకు ఇంద్రగంటి ఎంపిక చేసినట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ, అందాల భామ హైదరీ, నేచురల్ స్టార్ నాని, విలక్షణ దర్శకుడు ఇంద్రగంటి కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి.